పోటీ నుంచి తప్పుకుంటావా లేదా?కడప నుంచి ఫోన్!

Naga Babu

అది కోడి కత్తి కావచ్చు… గులాకరాయి కావచ్చు… మరొకటి కావచ్చు కానీ వైసీపి వ్యూహాల పేరుతో చేస్తున్న కుట్రలు ఎప్పుడూ బెడిసికొడుతూనే ఉన్నాయి. అయినా కుట్రలు వైసీపి డీఎన్ఏలోనే ఉన్నాయి కనుక ఆ దూరలవాటుని అది మానుకోలేకపోతోంది. కనుక పదేపదే భంగపడుతోంది కూడా.

టిడిపితో జనసేన పొత్తు పెట్టుకోకుండా అడ్డుకునేందుకు పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్ళిళ్ళ గురించి అవహేళనగా మాట్లాడటం, దత్తపుత్రుడు అంటూ ప్రజలలో ఆయన పట్ల అపనమ్మకం కలిగించెందుకు వైసీపి చేసిన దురాలోచనలు ఫలించలేదు. కనుక ఇప్పుడు పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ని ఓడించేందుకు తనకు తెలిసిన టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శిస్తోందని, వాటిలో బ్లేడ్ బ్యాచ్, ఎర్రచందనం స్మగ్లర్లు కూడా ఉన్నారని పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా బయటపెట్టిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

పవన్‌ కళ్యాణ్‌ కోసం పిఠాపురం టికెట్‌ త్యాగం చేసిన టిడిపి నియోజకవర్గం ఇన్‌చార్జి ఎస్‌విఎస్‌ఎన్‌ వర్మ వైసీపిలో చేరబోతున్నారంటూ వైసీపి సోషల్ మీడియా పుకార్లు పుట్టించింది. అయితే వాటిని ఆయన వెంటనే ఖండించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ వంటి గొప్ప వ్యక్తి కోసం సీటు త్యాగం చేయడం గౌరవంగా భావిస్తున్నానని వర్మ చెప్పారు.

తాజాగా మరో కొత్త విషయం బయటపడింది. పిఠాపురం నుంచి వైసీపి అభ్యర్ధిగా వంగా గీత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె కాకుండా గీత అనే మరో మహిళ కూడా స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేశారు.

ఆమెకు కడప నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి నేను లెక్చరర్‌నని పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత మెల్లగా మాటలలో తాను వైసీపికి చెందినవాడినని, తమ పార్టీ ఐ‌టి విభాగం ఎంత పవర్ ఫుల్ అంటే దాని ద్వారా రాష్ట్రంలో ఎవరి వ్యక్తిగత వివరాలైనా క్షణాలలో సేకరించగలమని గొప్పగా చెప్పుకొన్నాడు. అలాగే ఆమె నామినేషన్, అఫిడవిట్‌ వివరాలు కూడా సేకరించామని గొప్పగా చెప్పుకున్నాడు.

దేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని చెపుతూనే నువ్వు జనసేన ప్రోద్బలంతోనే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నావని మాకు తెలుసని కనుక పోటీ నుంచి విరమించుకోవాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. ఆమె ఆ సంభాషణను రికార్డ్ చేసి జనసేన నాయకుడు నాగబాబుకి పంపించారు.

నాగబాబు ఆ ఫోన్ సంభాషణను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “కడప వైసీపి గూండాలు పిఠాపురంలో ప్రజలను, ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? ఒక మహిళా అభ్యర్ధిని ఈవిదంగా ఫోన్ చేసి బెదిరిస్తే మేము చూస్తూ ఊరుకోము. మీ కడప గూండాలనే కాదు దావూద్ ఇబ్రహీంని తెచ్చుకున్నా మేము భయపడం. మీరు గూండాలైతే మేము పోలీసు బిడ్డలం. మిమ్మల్ని ఎలా కట్టడి చేయాలో మాకు తెలుసు. దమ్ముంటే పిఠాపురానికి రండి అక్కడే అమీ తుమీ తేల్చుకొందాము. పిఠాపురం ప్రజల జోలికి వస్తే మేము కూడా ఏమి చేయాలో అదే చేస్తాము. కబడ్దార్!” అని నాగబాబు హెచ్చరించారు.

ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి మళ్ళీ అధికారంలోకి రావాలని చాలా పట్టుదలగా ఉన్న వైసీపి, అందుకోసం ఏమి చేయడానికైనా సిద్దం అన్నట్లు వ్యవహరిస్తోందని, కానీ వైసీపి ఓడిపోబోతోందని నాగబాబు అన్నారు. ఇలా రెచ్చిపోయిన ప్రతీ ఒక్కరికీ తమ కూటమి అధికారంలోకి వచ్చాక తగినవిదంగా బుద్ధి చెపుతామని నాగబాబు హెచ్చరించారు.

ADVERTISEMENT
Latest Stories