ప్రస్తుతం యూరప్ లో త్రివిక్రమ్ సినిమా కోసం షూటింగ్ చేస్తున్న పవన్ కళ్యాణ్, ఈ నెలాఖరు లోగా ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇక రాజకీయాల పై దృష్టి పెట్టనున్నారు. డిసెంబరు 7 నుంచి పూర్తి సమయం పార్టీ కార్యకలాపాలకు కేటాయిస్తారని జనసేన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
త్వరలోనే నియోజకవర్గ కమిటీలు ప్రకటిస్తామని, ఎన్నికల నాటికి జనసేన పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధమవుతుందని ఈ సందర్భంగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్నిస్థానాల్లోనూ పోటీ చేస్తామని ఆయన చెప్పారు. ఒకవేళ అదే నిజం అయితే జనసేన వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకుండా పోటీ చేస్తాడని అనుకోవాలి.
తమ పార్టీలో పవన్‌కళ్యాణ్ మాత్రమే సుప్రీమ్ అని, ఆయన మాటే శిలాశాసనమని తెలిపారు. పవన్‌కళ్యాణ్ అనంతపురం జిల్లానుంచి పోటీ చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో పార్లమెంటు స్థానానికి 20 మంది చొప్పున 42 స్థానాలకు 840 మంది సమన్వయకర్తలను నియమించేందుకు జనసేన సన్నాహాలు చేస్తోంది. ఔత్సాహిక శిబిరాలకు హాజరైన వారి నుంచి సమన్వయకర్తలను ఎంపిక చేస్తారు.





