పిఠాపురం ‘సక్సెస్ మీట్’ కు దారేది..?

Pawan Kalyan Majority

సినీ పరిభాషలో చెప్పాలంటే ఒక సినిమా విడుదలైన తరువాత ఆ మూవీ ప్రేక్షకుల మన్ననలు పొంది బాక్స్ ఆఫీస్ దగ్గర విజేతగా నిలిస్తే అప్పుడు ఆ చిత్ర యూనిట్ మూవీ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సక్సెస్ కు కారణమైన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియచేస్తుంది. ఇప్పుడు రాజకీయాలలో కూడా ఇదే ట్రెండ్ నడుస్తుంది. అయితే ఫలితాలకు ముందే కొందరు ఓటర్లకు కృతజ్ఞత తెలియచేస్తే మరికొందరు పోలైన ఓటింగ్ శాతానికి అభినందనలు తెలియచేస్తున్నారు.

అయితే ఏపీ ఎన్నికలలో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న ప్రాంతంగా పిఠాపురం ఈ ఎన్నికలలో హాట్ సీట్ గా మారిపోయింది. 2019 ఎన్నికలలో పోటీ చేసిన రెండు స్థానాలలో ఓటమి చెందడంతో ఈ ఐదేళ్లు ఆ అవమాన భారాన్ని మోస్తూ, వైసీపీ నేతల చీత్కారాలను భరిస్తూ ఈ సారి కొట్టించుకోవడం కాదు మనమే కొట్టాలి అనే గట్టి పట్టుదలగా పని చేసింది జనసేన.

ADVERTISEMENT

2024 ఎన్నికల ఫలితాల తరువాత జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో పవన్ గొంతు వినిపించడానికి, ‘పవన్ అనే నేను’…అనే ఒక వాక్యం వినడానికి యావత్తు రాష్ట్ర ప్రజానీకం ముఖ్యంగా జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఒక పార్టీ అధినేతగా ఉంటూ కూటమి తరుపున రాష్ట్ర వ్యాప్త ప్రచార బాధ్యతలు స్వీకరించాల్సిన పవన్ తానూ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయించడం సాధ్యం కానీ పరిస్థితి.

అయితే ఈ సమయంలో జనసేన తరుపున పవన్ గెలుపు కోసం పని చేయాల్సిన బాధ్యతను అక్కడి టీడీపీ ఇంచార్జ్ SVSN వర్మ తో పాటుగా వెండి తెర, బుల్లి తెర నుంచి నటీనటులు స్వచ్ఛదంగా వచ్చి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని జనసేనకు తమ వంతు సాయమందించారు. జబర్దస్త్ టీం నుండి గెటప్ శ్రీను, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రాజు, బుల్లితెర నటులైన సీరియల్ యాక్టర్స్ శ్రవణ్, సహస్రా నాయుడు, పూజ మూర్తి వంటి అనేక మంది వారి షెడ్యూల్ ను మార్చుకుని మరి పవన్ గెలుపు కోసం ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

అలాగే 40 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్, ప్రముఖ నిర్మాత నాగ వంశీ, మెగా హీరోలు, జానీ మాస్టర్ వంటి సినీ ఇండస్ట్రీ ప్రముఖులు వైసీపీ అవమానాల నుంచి పవన్ ను తప్పించడానికి ఎండలను సైతం లెక్క చేయకుండా, వైసీపీ దౌర్జన్యులను తట్టుకుంటూ పిఠాపురంలో ప్రతి గడప తట్టారు. అటువంటి నిస్వార్థ సేవను గుర్తించి పవన్ వారి కోసం కొంత సమయం కేటాయించి వారి ప్రేమకు కృతజ్ఞతలు తెలియచేస్తే అది వారికి కోట్ల రూపాయల కాగితం నోట్లకన్నా విలువైనదిగా భావిస్తారు.

ఇప్పటికే పిఠాపురంలో పవన్ గెలుపు దాదాపుగా ఖాయమైంది. కేవలం మెజారిటీ మీదే అందరి ద్రుష్టి ఉండడంతో వైసీపీ పార్టీ కూడా పిఠాపురం పై పూర్తిగా ఆశలు వదులుకుంది. ‘వార్ వన్ సైడ్’ అంటూ ఇప్పటికే టీడీపీ నేత వర్మ మీడియా ముఖంగా పవన్ గెలుపుని నిర్దారించేసారు. అయితే జూన్ 4 తరువాత చూడాల్సింది మెజారిటీ మాత్రమే అంటూ వర్మ పవన్ ఫాన్స్ కు కిక్కెక్కిస్తున్నారు. అయితే ఈ గెలుపులో పవన్ పాత్రతో పాటు వర్మ త్యాగం, నటీనటుల కష్టం కూడా దాగి ఉందనేది జనసేన గుర్తించాలి.

ADVERTISEMENT
Latest Stories