ఏపీ ఎన్నికలలో టిడిపి, జనసేనలు ఇప్పటికే పొత్తులు, సీట్ల సర్దుబాట్లు చేసుకున్నాయి. బీజేపీ కూడా చేరితే అన్నీ ఫైనల్ చేసుకుందామని ఇంత కాలం తమ జాబితాలను ప్రకటించకుండా ఓపికగా ఎదురుచూస్తున్నాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ తర్వాత బీజేపీ 5-6 ఎంపీ సీట్లు, 10-12 అసెంబ్లీ సీట్లు అడిగిన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ 10-12 కాదు… కనీసం 20 సీట్లు తీసుకోవాలని ఏపీ బీజేపీ తమ అధిష్టానానికి సూచించిన్నట్లు తెలుస్తోంది.
కర్నూలు మినహా మిగిలిన అన్ని జిల్లాలలో బీజేపీకి తప్పనిసరిగా శాసనసభ సీట్లు తీసుకోవాలని చెప్పిన్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా చూస్తే, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపి 6 సీట్లు, కృష్ణాలో 2, గుంటూరులో 4, చిత్తూరులో 1, కడపలో 1, నెల్లూరులో 2, ప్రకాశం, అనంతపురం, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ఒక్కో ఎమ్మెల్యే సీటు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించిన్నట్లు తెలుస్తోంది.
నియోజకవర్గాల వారీగా చూస్తే, జమ్మలమడుగు, మదనపల్లి, నెల్లూరు సిటీ లేదా రూరల్, ధర్మవరం, ఒంగోలు, రాజమండ్రి, పి.గన్నవరం, కాకినాడ సిటీ, కైకలూరు, విజయవాడ సెంట్రల్, గుంటూరు (వెస్ట్), ప్రత్తిపాడు, బాపట్ల, నరసారావుపేట, తాడేపల్లి గూడెం లేదా ఉంగటూరు, ఏలూరు, వైజాగ్ (నార్త్), అరకు వ్యాలీ, శ్రీకాకుళం లేదా విజయనగరం సీట్లను తప్పనిసరిగా తీసుకోవాలని ఏపీ బీజేపీ తమ అధిష్టానానికి సూచించిన్నట్లు తెలుస్తోంది.
ఈ నియోజకవర్గాలలో బీజేపీకి మంచి పట్టుందని కనుక వీటిలో 15 సీట్లకు తక్కువ కాకుండా తీసుకోవాలని ఏపీ బీజేపీ తమ అధిష్టానానికి సూచించింది. ఒకవేళ ఇన్ని సీట్లు ఇచ్చేందుకు టిడిపి నిరాకరిస్తే, దాంతో పొత్తులు పెట్టుకోవడం కంటే బీజేపీ ఒంటరిగా లేదా జనసేనతో కలిసి పోటీ చేసినా 20 కంటే ఎక్కువ సీట్లే గెలుచుకోగలమని తమ అధిష్టానానికి సూచించిన్నట్లు తెలుస్తోంది. ఇదేవిదంగా 5-6 ఎంపీ సీట్లు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించిన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ బీజేపీ అడిగినన్నీ సీట్లు ఇవ్వాలంటే టిడిపి, జనసేనలు రెండూ చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే రెండు పార్టీలలో అసంతృప్తి జ్వాలలు మొదలైతే వాటికే ప్రమాదం. అందరికీ తెలిసిన కారణాల వలన ఏపీ ప్రజలు బీజేపీని పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఏపీలో బీజేపీ ఓడిపోయే ప్రతీ సీటు వైసీపియే గెలుచుకుంటుంది. కనుక బీజేపీ ఎన్ని సీట్లు తీసుకోగలిగితే అంతా వైసీపికే మేలు కలుగుతుంది. అంటే టిడిపితో బీజేపీ పొత్తులు పెట్టుకుని పరోక్షంగా వైసీపికి సహకరిస్తున్నట్లు అనుమానించవలసి ఉంటుంది.
నిజానికి టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకున్నప్పుడే సగం విజయం ఖాయం అయ్యింది. రెండు పార్టీలు సీట్లసర్దుబాట్లు చేసుకొని ముందుకు సాగుతుండగా, జగన్మోహన్ రెడ్డి వైసీపిలో అభ్యర్ధులను మార్చేసుకుంటూ పార్టీని అల్లకల్లోలం చేసుకొంటున్నారు. మరోపక్క వైఎస్ షర్మిల వచ్చి జగన్మోహన్ రెడ్డిని, వైసీపిని చీల్చి చెండాడేస్తుండటం వలన టిడిపి, జనసేనలకు విజయావకాశాలు మరింత పెరిగాయి.
కనుక బీజేపీతో పొత్తు పెట్టుకోకపోయినా అవి తప్పకుండా విజయం సాధించగలవు. ఈ నెల 20న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలతో మరోసారి సమావేశం అవుతారని తెలుస్తోంది. బహుశః అదే చివరి సమావేశం కావచ్చు. ఆ తర్వాత బీజేపీతో టిడిపి, జనసేనల పొత్తు ఉంటుందో లేదో తేలిపోతుంది.
ఎన్నికలలో వైసీపి పెట్రేగిపోయి దౌర్జన్యాలకు పాల్పడకుండా అడ్డుకునేందుకే టిడిపి, జనసేనలు బీజేపీతో పొట్టుకి సిద్దం అవుతున్నాయనేది బహిరంగ రహస్యం. కానీ దాని కోసం అవి ఇంత త్యాగాలు చేయవలసిన అవసరమే లేదు.
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను, కుల సమీకరణాలను, పార్టీల బలాబలాలను, ప్రజాభిప్రాయాలను ఓసారి నిశితంగా పరిశీలిస్తే ఈసారి ఎన్నికలలో వైసీపి ఏం చేసినా గెలిచే అవకాశం లేదని అర్దమవుతుంది. అటువంటప్పుడు టిడిపి, జనసేనలు బీజేపీ కోసం త్యాగాలు చేయాల్సిన అవసరం ఏమిటి?






