టిడిపి, జనసేనల ప్రభంజనం ఉందిగా… డోంట్ వర్రీ!

JanaSena_TDP

ఒక్కోసారి ఎన్నికలలో ఒక్కో పార్టీ లేదా కూటమి ప్రభంజనం ఉంటుంది. రాజకీయ పార్టీలు, వాటి నేతలు కొంతవరకు దానిని ముందే గుర్తించగలుగుతుంటారు. ఉదాహరణకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలువబోతోందని చాలా మంది నేతలు ముందే గ్రహించి ఆ పార్టీలో చేరిపోయారు. ఎన్నికలకు 15 రోజుల ముందే బిఆర్ఎస్ పార్టీ ఓడిపోబోతోందని గ్రహించామని కేసీఆర్‌ స్వయంగా చెప్పుకున్నారు కూడా.

ADVERTISEMENT

తెలంగాణ కేసీఆర్‌లాగే వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి కూడా 175/25 సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కానీ ఈసారి టిడిపి, జనసేనల ప్రభంజనంలో వైసీపి కొట్టుకుపోబోతోందని గ్రహించిన్నట్లే ఉన్నారు. అందుకే చివరి ప్రయత్నంగా పార్టీ అభ్యర్ధులను మార్చుకుంటున్నారు. ఇదే సమయంలో ఈసారి టిడిపి, జనసేనల ప్రభంజనం రాబోతోందని గ్రహించిన వైసీపి ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీకి రాజీనామాలు చేసి టిడిపి, జనసేనలలో చేరిపోతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

కనుక వైసీపి బలమైన అభ్యర్ధులున్న చోట పోటీ చేయడానికి టిడిపి, జనసేనల అభ్యర్ధులు వెనుకంజ వేయనవసరం లేదని భావించవచ్చు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గంటా శ్రీనివాసరావుని కోరారు.

ఎందుకంటే ఆయన 1999లో అనకాపల్లి ఎంపీగా, 2004లో చోడవరం టిడిపి ఎమ్మెల్యేగా, 2009లో అనకాపల్లి నుంచి ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా, 2014లో భీమిలి టిడిపి ఎమ్మెల్యేగా, 2019లో టిడిపి విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన గొప్ప ట్రాక్ రికార్డ్ ఉంది.

విజయనగరం జిల్లాకు చెందిన బొత్స ఝాన్సీరాణి విశాఖ నుంచి వైసీపి ఎంపీ సీటుకి పోటీ చేస్తున్నప్పుడు, గంటా శ్రీనివాసరావు చీపురుపల్లి నుంచి పోటీ చేస్తే అవలీలగా బొత్స సత్యనారాయణని ఓడించగలరని చంద్రబాబు నాయుడు భావించారు. కానీ బొత్స కుటుంబం పోల్ మేనేజిమెంట్ గురించి బాగా ఎరిగిన గంట వెనకడుగు వేశారు.

దీంతో చీపురుపల్లికే చెందిన టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావుని పోటీ చేయవలసిందిగా కోరగా ఆయన కూడా నిరాకరించారు. 2014 ఎన్నికలప్పుడు రాష్ట్రంలో టిడిపి, జనసేన, బీజేపీ ప్రభంజనం నెలకొంది. అప్పుడు ఆయన మరదలు మృణాళిని టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి బొత్స సత్యనారాయణని ఓడించారు.

కానీ 2019లో వైసీపి ప్రభంజనం నెలకొని ఉన్నప్పుడు ఆమె కుమారుడు కిమిడి నాగార్జున బొత్స సత్యనారాయణ చేతిలో ఓడిపోయారు. ఈసారి టిడిపి, జనసేనల ప్రభంజనం ఉంది కనుక చీపురుపల్లి నుంచి గంటా లేదా కిమిడి ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా అవలీలగా గెలిచే అవకాశం కనిపిస్తోంది.

కానీ విజయనగరం జిల్లా అంతటా అల్లుకుపోయిన బొత్స సత్యనారాయణ కుటుంబాన్ని, వారికి అండగా కాపు పెద్దలైన ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు)న్ని ఎదుర్కొని నిలబడటం కష్టమని గంటా, కిమిడి వంటి సీనియర్ టిడిపి నేతలు వెనకడుగు వేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఈ పరిస్థితులలో విజయనగరంలో కాపు సామాజిక వర్గానికే చెందిన మీసాల గీత లేదా కిమిడి నాగార్జునకు బొత్స సత్యనారాయణపై పోటీ చేసే అవకాశం లభించవచ్చు.

వారిద్దరిలో ఎవరికి అవకాశం లభించినా బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నేతను ఢీకొని ఓడించగలిగితే రాజకీయాలలో దూసుకుపోవడం ఖాయం. ఒకవేళ బొత్స చేతిలో ఓడిపోయినా, టిడిపి, జనసేనలు అధికారంలోకి రాగలిగితే వారి త్యాగానికి తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories