‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన తర్వాత చిత్రాన్ని చేయబోతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ కోసం కొరటాల శివ స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నారు. మరో వైపు ఎన్టీఆర్ తన తాజా చిత్రం ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. రేపు సంక్రాంతి కానుకగా ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం విడుదల అవ్వబోతుంది. ఈ సందర్బంగా తన తర్వాత సినిమా గురించిన పలు విషయాలను ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.
ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న చిత్రానికి ‘జనత గ్యారేజ్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే టాక్ గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని, ఇప్పటి వరకు టైటిల్ గురించిన ఆలోచనే చేయలేదు అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు మలయాళంలో కూడా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం చేయనున్నట్లుగా పేర్కొన్నాడు. షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత టైటిల్‌పై నిర్ణయం తీసుకుంటామని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. హీరోయిన్ కూడా ఇప్పటి వరకు ఎంపిక కాలేదు అని ఎన్టీఆర్ అన్నాడు. అతి త్వరలోనే పూర్తి వివరాలను వెళ్లడిస్తామని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.





