“ఒక పుష్కర కాలం తర్వాత మళ్ళీ తనకు కావాల్సిన సినిమా దొరికిందని, ‘సింహాద్రి’ తర్వాత ఆ రేంజ్ సినిమాగా ‘జనతా గ్యారేజ్’ సినిమా నిలుస్తుందని, ‘రభస’ వరకు సాగిన అనుకోని తన ప్రయాణం తర్వాత, ‘టెంపర్’ ద్వారా తన గమ్య స్థానం వైపుకు ఒకడుగు పడిందని, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో మరింత దగ్గర అయ్యాయని, ఇపుడు ఎస్… ‘జనతా గ్యారేజ్’తో తన గమ్యస్థానానికి చేరుకుంటాను” అంటూ ఎంతో నమ్మకంతో జూనియర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ ఆడియో వేడుకపై స్పందించిన విషయం తెలిసిందే. ఖచ్చితంగా ‘బ్లాక్ బస్టర్’ విజయాన్ని అందుకుంటుందన్న నమ్మకాన్ని దర్శకుడు కొరటాల శివతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా వ్యక్తం చేసారు.
మరి తారక్ ఆశించినట్లు ‘జనతా గ్యారేజ్’ తన గమ్యస్థానానికి చేర్చిందా? ‘టెంపర్, నాన్నకు ప్రేమతో’ సినిమాల ఒరవడిని కొనసాగించే విధంగానే ‘జనతా గ్యారేజ్’ ఫలితం దక్కిందా? ప్రస్తుతానికి సినీ ప్రేక్షకులలో, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఇదే ఆసక్తి. జూనియర్ ఎన్టీఆర్ అనుకున్న గమ్య స్థానం చేరుకున్నడా లేదా అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేం గానీ, బహుశా ఈ వీకెండ్ ముగిసేపాటికి ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లభిస్తుంది. కానీ, తారక్ అందుకోవాల్సిన లక్ష్యానికి ‘ఓపెనింగ్ టాక్’ మాత్రం ఆశాజనకంగా లేకపోవడం అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తోంది.
అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కు కలిసొచ్చే కీలక అంశం ఏమిటంటే… బాక్సాఫీస్ వద్ద మరే పెద్ద సినిమా లేకపోవడం. అలాగే ఈ ఏడాది సమ్మర్లో సెన్సేషన్ హిట్ అయిన ‘సరైనోడు’ సినిమాకు కూడా తొలి రోజు ఇలాంటి స్పందనే వచ్చి, ఆ తర్వాత భారీ విజయాన్ని నమోదు చేసుకుని, అల్లు అర్జున్ ఆశించలేని గమ్యస్థానంలో నిలబెట్టింది. మరి ‘జనతా గ్యారేజ్’ విషయంలో అలాంటి సంచలనాలే నమోదవుతాయా? అంటే ప్రస్తుతానికి స్పష్టంగా చెప్పలేము గానీ, జూనియర్ ఎన్టీఆర్ నిరాశ చెందే విధంగా మాత్రం సినీ విశ్లేషకుల స్పందన ఉండడం విశేషం.



