ఏ రాజకీయ పార్టీకైనా అంతిమ లక్ష్యం ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావడమే. అందుకు అవి అనేక మార్గాలు, వ్యూహాలు అనుసరిస్తుంటాయి.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి, రాజధాని, పోలవరం నిర్మాణాలు, పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడానికే తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజలు కూడా ఆయన నుంచి అదే ఆశించారు.
అప్పటి రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా అది చాలా మంచి నిర్ణయమే. ఇటువంటి భారీ అభివృద్ధి పనులు చేపట్టి ముందుకు తీసుకువెళుతూనే వాటితో పాటు ఉద్యోగులకు నెలనెలా జీతాలు చెల్లిస్తూ వారి వేతన సవరణలు కూడా చేశారు. ఉన్నంతలో సంక్షేమ పధకాలను కూడా అమలుచేశారు.
చేతిలో చిల్లి గవ్వ లేని పరిస్థితులలో ఇవన్నీ ఏకకాలంలో చేయడం సాధారణమైన విషయమేమీ కాదు. కనుక చంద్రబాబు నాయుడికి, టిడిపి ప్రభుత్వానికి నూటికి నూరు మార్కులు పడ్డాయి.
ఆ తర్వాత క్రమంగా చంద్రబాబు ప్రభుత్వం రాజకీయాలలో చిక్కుకొని తప్పటడుగులు వేసి చేజేతులా జగన్మోహన్ రెడ్డికి అవకాశం కల్పించింది. ఆ తర్వాత పగ్గాలు చేపట్టిన జగన్ ప్రజలు చంద్రబాబుని కాదని తనను ఎందుకు గెలిపించారో గ్రహించకుండా సంక్షేమ పధకాలనే ప్రభుత్వ విధానంగా మార్చుకొని 5 ఏళ్ళు ఆవిదంగానే ముందుకు సాగారు.
అభివృద్ధిని విస్మరించి సంక్షేమ పధకాలతో ముందుకు సాగుతుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తినా జగన్ వెనకడుగు వేయలేదు. ఈ విధానంతోనే మళ్ళీ అధికారంలోకి రావచ్చని అనుకున్నారే తప్ప దాని వలన రాష్ట్రానికి కలుగుతున్న నష్టాన్ని పట్టించుకోలేదు.
జగన్ విధానం తప్పని తెలిసినా దానితో తమకు ఓట్లు రాలుతాయని నమ్మిన వైసీపి నేతలు కూడా ఆయనకు వంత పాడారే తప్ప ఎవరూ ఇది తప్పని చెప్పలేదు.
చివరికి ఎన్నికల ప్రచారంలో కూడా జగన్, వైసీపి నేతలు సంక్షేమ పధకాల గురించి గట్టిగా చెప్పుకొని, తమదే సరైన విధానమని, మళ్ళీ అధికారంలోకి వస్తే ఇదే విధానంతో ముందుకు సాగుతామని విస్పష్టంగా చెప్పారు.
కానీ జగన్ సంక్షేమ విధానం వలన లబ్ధిదారులకు కలిగిన మేలు కంటే రాష్ట్రానికి జరిగిన నష్టమే ఎక్కువగా ఉందని టిడిపి కూటమి గట్టిగా వాదించింది. అప్పు చేసి పప్పు కూడా తినిపించడం సరికాదని గట్టిగా నొక్కి చెప్పింది. అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలతో సంపద సృష్టిస్తూ దానిని సంక్షేమ పధకాల కోసం ఖర్చు చేస్తామని విస్పష్టంగా చెప్పింది.
రాష్ట్ర విభజన తర్వాత ఈ పదేళ్ళలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రెండు రాజకీయ విధానాలను వాటి ఫలితాలను కళ్ళారా చూసి అనుభవించారు కూడా. కనుక వాటిలో ఏ విధానం సరైనదో లేదా వాటిలో ఏది తమకు నచ్చిందో మే 13న తీర్పు చెప్పేశారు.
ఒకవేళ టిడిపి కూటమి గెలిస్తే ప్రజలు వైసీపి విధానాలు తప్పని చెప్పిన్నట్లవుతుంది. వైసీపి గెలిస్తే రాష్ట్రాభివృద్ధి, రాజధాని, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన, శాంతిభద్రతలు అంత ముఖ్యం కాదని వాటి కంటే సంక్షేమ పధకాల పేరుతో ఎప్పటికప్పుడు చేతిలో డబ్బులు పడితే చాలని ప్రజలు అనుకుంటున్నట్లు భావించవచ్చు.
ఒకవేళ జగన్ గెలిస్తే, దేశంలో మిగిలిన రాష్ట్రాలు కూడా అభివృధ్దిని పక్కన పెట్టి సంక్షేమ విధానానికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఒకవేళ టిడిపి కూటమి గెలిస్తే సంక్షేమ విధానంతో ముందుకు సాగితే జగన్మోహన్ రెడ్డిలాగా ఎదురుదెబ్బ తింటామనే భయం, ఆలోచన ఏర్పడతాయి. కనుక అభివృద్ధితో కూడిన సంక్షేమ విధానానికి కట్టుబడక తప్పదు. కనుక ఆంధ్రా ప్రజల తీర్పు ఒక్క ఏపీకే పరిమితం కాబోదు. ఇతర రాష్ట్రాలపై కూడా దాని ప్రభావం చాలా ఉండబోతోందని భావించవచ్చు.






