వాళ్ళు ఆ అధికారం దూరమైతే నిలబడతారా..?

BRS Party K keshava Rao

అధికారం ఉన్నన్నాళ్ళు మంది మార్బలంతో బలంగా నిలబడిన కేసీఆర్ ను చూసిన వారంతా తెలంగాణలో ఈయనను గద్దె దింపే నాయకుడు వస్తాడా..? అటువంటి పార్టీ ఉంటుందా..? అంటూ కాలరెగరేసిన బిఆర్ఎస్ పార్టీ నేతలకు, మేధావులకు, రాజకీయ ఉద్దండులకి 2023 ఎన్నికలు చెంపపెట్టుగా మారాయనే చెప్పాలి.

అప్పటి తెరాస పార్టీకి ఎదురు నిలబడిన పార్టీని, ఆ పార్టీ లోని బలమైన నాయకులను తన పార్టీ కారెక్కించిన కేసీఆర్ ఇదంతా తన గొప్పతనం, తన మంచితనం, తన సమర్థత అంటూ జబ్బలు చరుచుకున్నారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ నేతలైన అధికారాన్ని, పదవులను ఆశించే అధికార పార్టీ వైపు ఆకర్షితులవుతారనే సత్యాన్ని ఈ నాటికీ గ్రహించారు కేసీఆర్.

ADVERTISEMENT

తెలంగాణలో పదేళ్లు ఏకచక్రాధిపత్యంగా రాష్ట్రాన్ని ఏలిన కేసీఆర్ వెంట నడవడానికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ పార్టీ నేతలందరూ ఒక్కొక్కరుగా తెరాస కండువా కప్పుకుని ప్రతిపక్షం అనే ముళ్ళు గుచ్చుకోకుండా గులాబీ తోటలో సేదతీరారు. అయితే ఇప్పుడు అదే గులాబీ ప్రతిపక్షం లోకి రావడంతో అధికారం అనే హస్తం గూటికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు బిఆర్ఎస్ నాయకులు.

ఒకపక్క ఓటమి బాధ, మరో పక్క కూతురు కవిత అరెస్టు భయం, ఇంకో పక్క కారు దిగుతున్న నేతల బెడద ఇలా ఎటు చూసిన కష్టాల కడలిలో ఒంటరి ప్రయాణం చేస్తున్నారు కేసీఆర్. అధికారం పోయి ఆరు నెలలు గడవక ముందే బిఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా పార్టీని వీడడం చూస్తుంటే ఇన్నాళ్లు తన మీద ప్రేమతోనో…భయంతోనో తన వెంట నడిచారు అనుకున్న నేతలందరూ అది ప్రేమ కాదు భయము కాదు అధికారం అనే అవకాశం కోసం కారెక్కారు…ఇప్పుడు కేసీఆర్ దగ్గర అది లేదు కాబట్టే కారు దిగి వెళ్లిపోతున్నారు అనేది సత్యాన్ని గ్రహించారు.

రాష్ట్ర విభజనకు ముందు వరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పిన కె. కేశవ్ రావు విభజన తరువాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కడతారు అని ఆశించినప్పటికీ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ వైపే నిలబడ్డారు అనే సత్యాన్ని తెలుసుకుని కాంగ్రెస్ నుండి తెరాస కు జంప్ అయ్యారు. కేసీఆర్ కూడా కేకే ను నెత్తిన పెట్టుకున్నారు.

అయితే అధికారం ఉన్నన్నాళ్లు స్వామి భక్తి చాటిన కేకే అధికారం దూరమవ్వగానే తనకు రాజకీయ జీవితం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలోనే చనిపోతా అంటూ కేసీఆర్ కు హ్యాండు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ కి పూలివ్వడానికి రెడీ అయ్యారు. ఎర్రవల్లి కేసీఆర్ ఫేమహౌస్ లో కేసీఆర్ ను కలిసిన కేకే పార్టీ మార్పు పై చర్చించారు. ఇన్నాళ్లు పదవులు అనుభవించి ఇప్పుడు కుంటి సాకులు చెప్పి పార్టీ మారతారా అంటూ కేసీఆర్ కేశవ్ రావు పై మండిపడినట్లు సమాచారం.

పార్టీలో మీకు సముచిత స్థానం కల్పించాం. పార్టీ తరుపున రాజ్యసభకు అవకాశం కల్పించాం. అయినా కూడా కష్ట సమయంలో ఇలా పార్టీ వీడడం మీకు న్యాయమా అంటూ కేసీఆర్ రాజకీయ విలువలు గురించి మాట్లాడుతున్నారు. ఇవే విలువలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు కూడా పాటించి ఉంటే కేసీఆర్ కు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు.

అధికారం కోసం వచ్చే ఇటువంటి నాయకులను నమ్ముకుని తన బలం పెరిగింది, తన బలగం పెరిగింది అనుకుంటే…అధికారం కోసం వచ్చిన వాళ్ళు ఆ అధికారం దూరమైతే నిలబడతారా..? అనే ప్రశ్నను ఎదుర్కోవాల్సిందే అనేది కేసీఆర్ కు ఇప్పుడు బాగా తెలిసి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే తప్పుని పునరావృత్తం చేసి ఇలా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి కేసీఆర్ కు గుణపాఠం చెపుతున్నాం అనే భ్రమలో ఉంటే మాత్రం ఆ భ్రమను తొలగించడానికి ఇటువంటి నాయకులకు మరో ఎన్నికల ఫలితాలు చాలనేది రేవంత్ రెడ్డి గ్రహించాలి.

ADVERTISEMENT
Latest Stories