ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే అభిమానులకు ఎంత పిచ్చో, అభిమానమో సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, ట్విట్టర్ లను ఓ మారు తిరగేస్తే తెలిసిపోతుంది. ‘కబాలి’ కన్నా రెండు వారాల ముందు సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్’ చిత్రం రంజాన్ పండగ నాడు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్ల దిశగా సాగుతుండగా, ఆ కలెక్షన్స్ కు మరో రెండు రోజుల్లో బ్రేక్ పడనుంది.
సూపర్ స్టార్ రజనీ చిత్రం ‘కబాలి’ విడుదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు సహా, దేశవ్యాప్తంగా దాదాపు 600 థియేటర్ల నుంచి ‘సుల్తాన్’ చిత్రాన్ని తొలగిస్తుండడంతో, ఇక సల్మాన్ ప్రభంజనానికి గండి పడినట్లేనని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, సుల్తాన్ కు – కబాలి ఇదే వ్యత్యాసమంటూ సామాజిక మాధ్యమాల్లో ఎవరో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.
“ఈద్ రోజు సెలవు కాబట్టి సుల్తాన్ రిలీజ్ చేశా” అని సల్మాన్ అంటుండగా… “నా సినిమా రిలీజైన రోజే సెలవు” అని రజనీకాంత్ చెబుతున్నట్టుగా ఒక ఫోటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ‘కబాలి’ చిత్రాన్ని చూసేందుకు ఉద్యోగులంతా ఒక్కసారిగా సిక్ లీవ్ లు తీసుకోవచ్చని భావించిన కొన్ని ఐటీ కంపెనీలు ముందుగానే తమ ఆఫీసులకు 22వ తేదీ నాడు సెలవు ప్రకటించిన విషయం సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా “కబాలి” ఫీవర్ ఏ రకంగా ఉందో చెప్పకనే చెబుతోందీ ఈ పోస్ట్.



