పరిపాలనా పరంగా కావచ్చు లేదా విధాన పరంగా కావచ్చు లేదా రాజకీయంగా కావచ్చు… ఏవిదంగా చూసినా జగన్ ప్రభుత్వం చేసిన తప్పులే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఒప్పులను వేళ్ళపై లెక్కించవచ్చు.
అయితే “ప్రజలు క్షమించలేనంత ఘోరమైన తప్పులేమీ చేయలేదని” మాజీ మంత్రి రోజా చెప్పడం చూస్తే నేటికీ వైసీపి నేతలు తమ తప్పులని తెలుసుకోలేకపోతున్నారని కనీసం ఒప్పుకోవడం లేదని స్పష్టం అవుతుంది.
విషయంలోకి వస్తే, వైసీపి అధికారంలో ఉన్నప్పుడు ఓ వైసీపి నాయకుడు కోసం బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి, 42 రోజులు జైల్లో పెట్టారు. ఆ తర్వాత కూడా వారిని వేధిస్తూ, బెదిరించారు. ఈ వ్యవహారంలో కూడా సజ్జల రామకృష్ణా రెడ్డి చక్రం తిప్పారని వార్తలలో చూస్తూనే ఉన్నాము.
ఇవి చూస్తున్నప్పుడు ఓ ప్రభుత్వం ఇటువంటి తప్పులు కూడా చేస్తుందా?అనే సందేహం కలుగకమానదు.
వైసీపి ప్రభుత్వం పోయింది కానీ అది చేసిన పాపాలలో పాలు పంచుకున్న అధికారులు మాత్రం ఎక్కడికీ పోలేరు. కనుక ఆ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన్నట్లు చెప్పబడుతున్న నాటి విజయవాడ పోలీస్ కమీషనర్‌గా క్రాంతి రాణా, డీసీపీ విశాల్ గున్నీ మరికొందరు అధికారుల పాత్రపై డిజిపి ద్వారకా తిరుమల రావు విచారణకు ఆదేశించారు.
బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ, కుటుంబ సభ్యులతో కలిసి నేడు విజయవాడ వచ్చి పోలీస్ కమీషనర్ రాజశేఖర్ బాబుని కలిసి వివరాలు తెలిపి, సదరు అధికారులపై ఫిర్యాదు చేయనున్నారు.
ఈ వ్యవహారంలో వైసీపి నేతలు శిక్ష నుంచి తప్పించుకోగలరు. కానీ వారి అండదండలు చూసుకొని ఆ స్థాయి ఐపీఎస్ అధికారులు కూడా తప్పులు చేసి ఇప్పుడు నష్టపోతుండటమే ఆలోచింపజేస్తుంది.
ఈ వ్యవహారంలో ఇన్ని తప్పులు చేసిన వైసీపి ఇంకా సమర్ధించుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటం, టిడిపి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
కాదంబరి జత్వానీ పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలను బ్లాక్ మెయిల్ చేస్తూ కోట్లు రూపాయలు పిండుకునేదని, అటువంటి యువతిపై జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, చంద్రబాబు నాయుడు ఆమెను వెనకేసుకువస్తూ రాజకీయ కక్ష సాధింపుకి సిద్దపడుతున్నారని వైసీపి ఆరోపిస్తోంది.
అయితే ముంబైలో ఉండే ఓ నటితో జగన్ ప్రభుత్వానికి ఏవిదంగా సంబంధం ఏర్పడింది?అనే అసలు విషయం చెపితే బాగుండేది. ఏదిఏమైనప్పటికీ వైసీపి పాపాలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బలవుతుండటం బాధాకరమే.






