ఇదీ… గేమ్‌చేంజ్! దటీజ్ రేవంత్ రెడ్డి

CM Revanth Reddy hands over Kaleshwaram project case to CBI, sparking political storm in Telangana

లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు… ఇప్పుడు దీని నుంచి నీళ్ళు పారడం లేదు… రాజకీయాలు, కేసులు పారుతున్నాయి. దీంతోనే కేసీఆర్‌ గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ఇప్పుడు దీంతోనే తీరని అప్రదిష్ట, ఊహించని కష్టనష్టాలు ఎదుర్కోబోతున్నారు. కేసీఆర్‌ పేరును రేవంత్ రెడ్డి చెరపగలరా?అని బీఆర్ఎస్‌ నేతలు పదేపదే ప్రశ్నిస్తుంటారు. ఎలా చెరుపబోతున్నారో ఇప్పుడు చూపిస్తున్నారు.

సిఎం రేవంత్ రెడ్డి ఈ కేసుని సీఐడీ లేదా సిట్‌కి అప్పగిస్తారనుకుంటే, సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించి బీఆర్ఎస్‌ పార్టీకి చాలా పెద్ద షాక్ ఇచ్చారు.

ADVERTISEMENT

మద్యలో కల్వకుంట్ల కవిత ఎంట్రీ ఇచ్చి ఈ వ్యవహారాన్ని మరింత జటిలం చేశారని చెప్పక తప్పదు. కాళేశ్వరం కేసులో అనేక కోణాలు కనిపిస్తున్నాయి. వాటి గురించి క్లుప్తంగా చెప్పుకుంటే…

1. ఈ కేసుని సీఐడీ లేదా సిట్‌కి అప్పగించి ఉండి ఉంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుప్పిట్లో ఉండేది. కానీ ఇప్పుడు మోడీ, అమిత్ షాల చేతికి వెళ్ళిపోయింది.

2. ఈ కేసు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతిలో ఉండి ఉంటే కేసీఆర్‌ తదితరులతో ఓ ఆట ఆడుకోగలిగి ఉండేది. కానీ అప్పుడు బీఆర్ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌ పార్టీని నిందిస్తూ సెంటిమెంట్ రాజకీయాలు చేయగలిగేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు.

3. ఈ కేసు సీబీఐ చేతికి అప్పగించడం ద్వారా కేసీఆర్‌ & కోపై చర్యలు తీసుకునే బాధ్యత మోడీ, అమిత్ షాలకు అప్పగించేసి సిఎం రేవంత్ రెడ్డి తన చేతికి మట్టి అంటకుండా జాగ్రత్త పడ్డారు.

4. ఒకవేళ సీబీఐ వారిపై చర్యలు తీసుకోలేకపోతే అప్పుడు రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్‌ నేతలందరూ కేంద్రాన్ని విమర్శించగలరు.

5. ఈ కేసులో కేసీఆర్‌పై సీబీఐ చర్యలు తీసుకుంటే మోడీ, అమిత్ షాలను బీఆర్ఎస్‌ పార్టీ విమర్శిస్తుంది. తీసుకోకపోతే తెలంగాణ కాంగ్రెస్‌ విమర్శిస్తుంది.

6. సీబీఐ విచారణ మొదలుపెడితే బీఆర్ఎస్‌ పార్టీ నేతలు మోడీ, అమిత్ షాలపై తమ బాణాలు గురిపెట్టాల్సి ఉంటుంది. వారితో మళ్ళీ కొత్త యుద్ధం మొదలుపెట్టాల్సి ఉంటుంది.

7. కేంద్రంపై కత్తులు దూస్తే ఏమవుతుందో బీఆర్ఎస్‌ పార్టీకి అనుభవపూర్వకంగా తెలుసు. కనుక కల్వకుంట్ల కవిత చెప్పినట్లు బీజేపిలో విలీనానికి సిద్దపడక తప్పదు. లేదా కనీసం రహస్య అవగాహన తప్పదు.

8. ఒకవేళ ఇదే జరిగి తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ మాయం అయితే అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ వర్సస్ బీజేపి రాజకీయాలు మొదలవుతాయి.

9. బీఆర్ఎస్‌-బీజేపి చేతులు కలిపితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇక ప్రతీరోజూ అగ్నిపరీక్షగా మారవచ్చు. వచ్చే ఎన్నికలో ఎదురీత తప్పకపోవచ్చు.

10. మద్యలో కవిత ఎంట్రీ ఇచ్చి తన తండ్రి దేవుడు అంటూనే మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని, అందువల్లే హరీష్ రావుని రెండో సారి మంత్రివర్గంలోకి తీసుకోవడానికి కేసీఆర్‌ చాలా ఆలోచించారని బాంబు పేల్చారు.

11. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరుగలేదని కేసీఆర్‌తో సహా అందరూ వాదిస్తుంటే, కల్వకుంట్ల కవిత చెప్పిన ఈ మాటలతో అవినీతి జరిగిందని నొక్కి చెప్పినట్లయింది.

12. హరీష్ రావుని రెండో సారి మంత్రివర్గంలోకి తీసుకోవడానికి తన తండ్రి కేసీఆర్‌ వెనకాడారని కల్వకుంట్ల కవిత చెప్పడం అంటే, కాళేశ్వరంలో జరిగిన అవినీతి గురించి తన తండ్రికి పూర్తిగా తెలుసని, అయినా ఉపేక్షించారని చెపుతున్నట్లే!

13. కేసీఆర్‌పై సీబీఐ విచారణ వరకు వస్తే ఇక బీఆర్ఎస్‌ పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత?అని కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు బీజేపిలో బీఆర్ఎస్‌ పార్టీ విలీనం అనివార్యమని సూచిస్తున్నట్లే ఉన్నాయి.

14. తన తండ్రి దేవుడని అంటూనే హరీష్ రావు, సంతోష్ వల్లనే ఆయనకీ ఈ అవినీతి మరక అంటిందని కల్వకుంట్ల కవిత చెప్పడం ఈ అవినీతిలో అందరూ భాగస్వాములే అని చెపుతున్నట్లే ఉంది.

15. కల్వకుంట్ల కవిత ఈవిదంగా మాట్లాడి కేసీఆర్‌కి, పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టించినందుకు ఆమెను పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం ఉంది.

16. అప్పుడు ఆమె హరీష్ రావు, బీఆర్ఎస్‌ పార్టీ గురించి మరిన్ని కొత్త విషయాలు బయటపెట్టడం ఖాయం. ఇది కాంగ్రెస్‌ పార్టీకి కలిసి వస్తుంది.

గేమ్‌ చేంజ్ అంటే ఇదీ… కాళేశ్వరం కేసుని సీబీఐకి అప్పగించాలనే సిఎం రేవంత్ రెడ్డి ఒకే ఒక్క నిర్ణయంతో తెలంగాణ రాజకీయాలను సమూలంగా మార్చేయబోతున్న గేమ్‌ చేంజర్‌ సిఎం రేవంత్ రెడ్డే!

ADVERTISEMENT
Latest Stories