కాంగ్రెస్ – బిఆర్ఎస్ మధ్య జరిగే రాజకీయ క్రీడకు కాళేశ్వరం ఒక వారధి కానుందా.? ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే కనిపిస్తుంది. బిఆర్ఎస్ ను రాజకీయంగా ఇరుకునపెట్టేందుకు కాళేశ్వరం అవినీతి అంటూ సీబీఐ తో కాంగ్రెస్ ముందుకెళ్తుంటే,
కాంగ్రెస్ కక్ష్య రాజకీయాలకు తెరలేపుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలుజరిగేలా కాళేశ్వరం పై విష ప్రచారం చేస్తుంది అంటూ బిఆర్ఎస్ కోర్టుల చుట్టూ తిరుగుతూ రాజకీయం నడుపుతుంది.
ఈ రెండు పార్టీల మధ్య మొదలైన ఈ రాజకీయ చదరంగంలో అసలు దోషులెవరు అని చెప్పడం ప్రభుత్వ వ్యవస్థలకు కూడా సాధ్యంకాని పనే అవుతుందేమో బహుశా. ప్రభుత్వం అవినీతి అంటూ ఆరోపిస్తుంటే ప్రతిఅపక్షం అన్యాయం అంటూ ఎదురుదాడి చేస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి నదీ నీటిని ఉపయోగించి నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ కాళేశ్వరం. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ, డిజైన్ మార్పులు చేసారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గత బిఆర్ఎస్ ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తూ, కాలేశ్వరం అవినీతి పై పూర్తి విచారణ అంటూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసింది.
అయితే ఆ నివేదిక ఆధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ల నిర్మాణంలో అనేక లోపాలు ఉన్నట్టు వెల్లడించారు. అయితే ఈ నివేదికను అసెంబ్లీలో చర్చించిన రేవంత్ సర్కార్ ఈ కేసును సిబిఐ కి అప్పగిస్తున్నట్టు అసెంబ్లీలో తీర్మానం చేసింది.
ఇక బిఆర్ఎస్ విషయానికొస్తే, కాళేశ్వరం పై కాంగ్రెస్ ప్రభుత్వం లేని ఆరోపణలు చేస్తూ, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, గత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా కేసీఆర్ ను టార్గెట్ చేస్తుందంటూ ఎదురుదాడికి దిగింది.
అలాగే తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ ను శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రాకు తరలించేందుకు సీఎం రేవంత్ కుట్ర పన్నుతున్నారంటూ, అందుకు బీజేపీ కూడా తనవంతు సాయం అందిస్తుందంటూ ఆరోపిస్తున్నారు కేటీఆర్.
అందులో భాగంగానే కాళేశ్వరం కమిషన్ నివేదిక పై బిఆర్ఎస్ నిరశన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. రేవంత్ సర్కార్ కుట్రల పై ఇవాళ, రేపు జిల్లా, మండల కేంద్రాలలో బిఆర్ఎస్ నాయకులు, ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు నిర్వహించాలంటూ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు.
అయితే కాంగ్రెస్ – బిఆర్ఎస్ పార్టీల మధ్య ఆరోపణలు – ప్రత్యారోపణలు ఇలా కొనసాగుతూ ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తమ పై రేవంత్ సర్కార్ చర్యలను ఆపాలంటూ కోర్టుల చుట్టూ తిరుగుతూ న్యాయపోరాటాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే సీబీఐ కి చేరిన కాళేశ్వరం దర్యాప్తు ను ఆపాలంటూ హైకోర్టు ను ఆశ్రయించారు హరీష్, కేసీఆర్. అయితే సీబీఐ విచారణ ఆపాలని ప్రభుత్వాన్ని తాము ఆదేశించలేమంటూ పేర్కొన్న హైకోర్టు రేపు విచారణకు ఆదేశించింది.
అలాగే రేపటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి చర్యలు చేపట్టొద్దు అంటూ హైకోర్టు రేవంత్ సర్కార్ ను ఆదేశించింది. అయితే గత బిఆర్ఎస్ హయాంలో గోదావరి నదీ జలాల వినియోగం అంటూ మొదలైన కాళేశ్వరం ప్రాజెక్ట్ నేడు సిబిఐ, న్యాయపోరాటలంటూ మలుపు తిరిగింది. అలాగే నాడు నీటి ఎత్తిపోతల పథకం కాస్త నేడు రాజకీయ దింపుడుకల్లెం మాదిరి తయారయ్యింది.




