ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ, దాని ప్రభుత్వంపై విమర్శలు చేయడం రాజకీయాల్లో సర్వసాధారణమే. ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలు, ప్రజా సమస్యలపై ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో వాటి బాధ్యత కూడా.
అయితే ఈ విమర్శలు చేసే పార్టీలే గతంలో అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు, పాలనా లోపాలు, వాటి హయంలో జరిగిన అవినీతి కారణంగానే ప్రజలు తమను గద్దె దించి వేరే పార్టీని ఎంచుకునేలా చేశాయన్న విషయాన్ని మాత్రం అంగీకరించవు. ప్రజలను మాయ మాటలు, భూటకపు హామీలతో మోసం చేసి గెలిచారని ఆక్షేపిస్తుంటాయి.
కానీ కొంతకాలం తర్వాత అవే ప్రతిపక్ష పార్టీలు తమ పాలనలో జరిగిన తప్పులను ఒక్కొక్కటిగా అంగీకరిస్తూ, మళ్లీ అవకాశం వస్తే అవి పునరావృతం కావని చెప్పుకుంటారు. మళ్లీ అదే నోటితో తమ పాలన ఓ స్వర్ణయుగమని గొప్పగా చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడరు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ గత రెండేళ్లుగా ఇదే చేస్తున్నాయి.
ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీతో తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకున్న కల్వకుంట్ల కవిత కూడా ఇదే తరహాలో రాజకీయాలు చేస్తున్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు ప్రధాన పార్టీలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి ఉంటే కొత్తగా టీఆర్ఎస్ పార్టీ పుట్టాల్సిన అవసరం వచ్చేది కాదని ఆమె అన్నారు. కానీ అవి ప్రజా సమస్యలు పట్టించుకోకుండా స్వప్రయోజనాలు చూసుకుంటున్నందునే తాను టీఆర్ఎస్ పార్టీని స్థాపించాల్సి వచ్చిందన్నారు.
అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లపాటు ఆమె అదే పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు బయటకు వచ్చి ఆ పార్టీ అవినీతికి పాల్పడిందని విమర్శించడమంటే తనని తాను విమర్శించుకున్నట్లే అవుతుంది.
ఇంతకాలం బీఆర్ఎస్ తానులో ముక్కగా ఉన్న ఆమె, ఇప్పుడు తాను దాని అవినీతిలో భాగమని అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. కానీ ఆమె కూడా భారీగా డబ్బు, ఆస్తులు పోగేసుకున్నారని సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తూనే ఉన్నారు కదా?
మరి తాను బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అంటే ప్రజలు ఎలా నమ్ముతారా? ఎందుకు నమ్మాలి? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఆమెను బహిష్కరించకపోయి ఉంటే, నేటికీ ఆమె అదే పార్టీలో ఉండేవారు కదా?
భవిష్యత్తులో మరో కొత్త పార్టీ పుట్టుకొస్తే, అప్పుడు అది కూడా టీఆర్ఎస్ పార్టీతో సహా రాష్ట్రంలో నాలుగు పార్టీలు సక్రమంగా పని చేయకపోవడం వల్లనే తాము వచ్చామని చెప్పుకోకుండా ఉంటుందా?




