2016 జనవరి 1వ తేదీన ‘నేను.. శైలజ…’ ద్వారా తెలుగు సినిమా మంచి బోణీ అందుకుంది. ఈ వీకెండ్ వరకు ఈ సినిమాకు డోకా లేకపోవడంతో తొలి మూడు రోజుల్లోనే బడ్జెట్ వెనక్కి వచ్చేయొచ్చు అన్న అంచనాలు ట్రేడ్ వర్గాల నుండి వ్యక్తమవుతున్నాయి. సినిమా పరంగా పాజిటివ్ టాక్ అందుకున్న 2016వ సంవత్సరంలో తొలి ఆడియో వేడుకకు కూడా రంగం సిద్ధమవుతోంది.
‘అలా మొదలైంది’ ద్వారా టాలీవుడ్ లో దర్శకురాలిగా పరిచయమైన నందిని రెడ్డి దర్శకత్వం వహించిన “కళ్యాణ వైభోగమే” సినిమా ఆడియో శనివారం సాయంత్రం విడుదల కానుంది. యువ హీరో నాగశౌర్య, ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేం మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ సినిమాకు కళ్యాణ్ కోడూరి స్వరాలు అందించారు.
గత వారమే విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా ఆడియో నేటికి వాయిదా పడగా, ఆడియో మాత్రం గత వారం నుండే ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. సందర్భోచితంగా సాగే మంచి ఆహ్లాదకరమైన పాటలుగా పేరు తెచ్చుకున్న “కళ్యాణ వైభోగమే” ఆడియో కూడా 2016కు మంచి ఓపెనింగ్ కానుంది.





