ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఐటీ వివరాలను హ్యాక్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కరీనాకపూర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబయిలోని సైబర్ సెల్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పారా మిలిటరీ బలగాలకు చెందిన ఇరవై ఆరు సంవత్సరాల ఒక వ్యక్తి, కరీనా కపూర్ ఐటీ వివరాలను హ్యాక్ చేశాడని ఈ సందర్భంగా పోలీసులు చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్ లో కరీనాకు సంబంధించిన ఇన్ కం ట్యాక్స్ అకౌంట్స్ హ్యాక్ అయినట్లు తమకు ఫిర్యాదు అందిందని అన్నారు.
ఈ నేపథ్యంలో దర్యాప్తులో పలు వివరాలు వెలుగులోకి వచ్చాయని, పారామిలిటరీ బలగాలకు చెందిన ఈ వ్యక్తి, ఆన్ లైన్ లో ఇన్ కం ట్యాక్స్ రిటర్స్న్ ఫైల్ చేసే విషయమై తన కొలీగ్స్ కు సహకరిస్తూ ఉంటాడని పేర్కొన్నారు. నిందితుడిని పోలీసులు ప్రశ్నించగా మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కరీనాకపూర్ కు తాను వీరాభిమానినని, ఆమె మొబైల్ నంబర్ తెలుసుకుంటే తనతో మాట్లాడవచ్చని అనుకున్నానని, అందుకే, ఈ హ్యాకింగ్ కు యత్నించానని చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు.



