కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ కొద్ది సేపటిక్రితం ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కలిపిస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు 65.69% పోలింగ్ నమోదైంది. కనుక మరో 5% పెరిగే అవకాశం ఉంది. పోలింగ్ గడువు ముగియడంతో అప్పుడే పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
వాటిలో చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి కాస్త ఆధిక్యత లభిస్తుందని చెపుతున్నప్పటికీ బిజెపి గట్టి పోటీ ఇస్తుందని చెపుతున్నాయి. కాంగ్రెస్, బిజెపిలకు ఇంచుమించు సరిసమానంగా సీట్లు రావచ్చని చెపుతున్నాయి. దేవగౌడ, కుమారస్వామిల జేడీఎస్ పార్టీకి 21-33 సీట్లు రావచ్చని చెపుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్, బిజెపిలకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సరిపడా మెజార్టీ రాకపోతే అప్పుడు జేడీఎస్ పార్టీ కింగ్ మేకర్ కాగలదు. అదే జరిగే కేసీఆర్ ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చినప్పటికీ అదే కింగ్ మేకర్ కాబోతోంది.
ఇంతకీ ఏ సర్వే సంస్థలు ఏం చెప్పేయంటే…
ఇక ఈ ఎన్నికల ఫలితాలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికలు-రాజకీయాలపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఒకవేళ బిజెపి గెలిచి అధికారంలోకి వస్తే తెలంగాణలో కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు తగినంత ఆత్మవిశ్వాసం, ధైర్యం లభిస్తాయి. ఓడిపోతే కేసీఆర్ ధాటికి బిజెపి నిలువలేకపోవచ్చు.
కర్ణాటకలో బిజెపి గెలిస్తే జనసేనను తమతో కలిసి పనిచేయాలని ఒత్తిడి చేయవచ్చు. అప్పుడు శాసనసభ ఎన్నికలలో ఓట్లు చీలి టిడిపి నష్టపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు వైసీపీ లాభపడుతుంది. అదే… కర్నాటకలో బిజెపి ఓడిపోతే, టిడిపితో చేతులు కలపాలని జనసేన ఒత్తిడి చేయగలదు. లేకుంటే బిజెపిని విడిచి టిడిపితో జనసేన కలిసి పనిచేయవచ్చు. అప్పుడు ఎన్నికలలో టిడిపి లాభపడగా, వైసీపీ నష్టపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఏపీలో బిజెపికి ప్రయోజనం లభించకపోవచ్చు.



