పవన్ కళ్యాణ్ అభిమానులకు, కత్తి మహేష్ కు మధ్య ‘యుద్ధం’ ఇప్పట్లో ఆగేలా కనపడడం లేదు. సోషల్ మీడియాలలో, ఎలక్ట్రానిక్ మీడియాలలో వీరిద్దరి మధ్య సాగుతున్న ‘మాటల యుద్ధాన్ని’ కత్తి మహేష్ మరింత ముందుకు తీసుకువెళ్ళే విధంగా ట్వీట్లు చేస్తున్నారు. సహజంగా అభిమానులకు ఉద్వేగం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి, ఎప్పుడూ సినీ సెలబ్రిటీలే వారిని అర్ధం చేసుకుని తగ్గి ఉంటారు.
కానీ కత్తి మహేష్ రూటు మాత్రం సపరేటుగా కనపడుతోంది. బిగ్ బాస్ మరియు పవన్ ఫ్యాన్స్ తో పెట్టుకున్న రగడ ద్వారా ఇప్పటికే కావాల్సిన పబ్లిసిటీ వచ్చేసినా కూడా ఇంకా పవర్ స్టార్ ఫ్యాన్స్ ను విడిచిపెట్టకుండా ఉడికిస్తూ ట్వీట్లు చేస్తుండడంతో, పవన్ ఫ్యాన్స్ కూడా తామేం తక్కువ కాదంటూ మండిపడుతున్నారు. తాజాగా ట్విట్టర్ లో “లార్గో వించ్” అనే సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ట్విట్టర్ లో పంచుకుంటూ “ఎందుకైనా మంచిది… ఈ సినిమా బాగా చూసి గుర్తు పెట్టుకోండి..” అన్న సందేశం ఇచ్చారు.
ఇక్కడ కత్తి కాస్త తెలివితేటలను ప్రదర్శిస్తూ… పవన్ పేరు గానీ, ఆయన సినిమా పేరును గానీ ప్రస్తావించలేదు. అయితే దీని ఆంతర్యం… పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి” సినిమాకు సంబంధించినదే అని, సదరు సినిమాకు రీమేక్ గా పవన్ సినిమా రూపొందుతుందని, అదే లింక్ ను కత్తి మహేష్ షేర్ చేసుకున్నారన్నది వాస్తవం. దీంతో మరోసారి కత్తి మహేష్ పై పవన్ కళ్యాణ్ అభిమానుల దండయాత్ర సాగుతోంది. అయితే కత్తి మహేష్ చెప్పాడని కంటే ముందుగానే ఓ ఆంగ్ల పత్రిక “అజ్ఞాతవాసి” ఓ సినిమాకు రీమేక్ ఏమో అన్న సందేహాన్ని ప్రచురించింది.
దానిని బలపరుస్తూ కత్తి మహేష్ ఏకంగా యూ ట్యూబ్ లింక్ కూడా షేర్ చేసుకున్నారు. ఇంతకీ ఈ ట్రైలర్ కు, ‘అజ్ఞాతవాసి’ టీజర్ కు ఏమైనా సంబంధం ఉందా? అంటే “అర్ధం చేసుకున్నోళ్ళకు అర్ధం చేసుకున్నంత” అంటూ వదిలేయడం మంచింది. ఎందుకంటే కత్తి మహేష్ షేర్ చేసుకున్న తర్వాత యూ ట్యూబ్ లో కామెంట్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి మరి. అయినా కత్తి మహేష్ వ్యాఖ్యలను, సదరు సినిమా ట్రైలర్ ను గుర్తుపెట్టుకోవడం కన్నా “అజ్ఞాతవాసి” సినిమా చూసి ఎంజాయ్ చేయడం మేలు అన్నది పరిపక్వత కలిగిన సినీ అభిమానుల మాట.



