అందరు ఊహించినట్టే బిఆర్ఎస్ ఓటమి కవిత నోటికి పని కల్పిస్తుంది, జాగృతి మద్దతుదారులకు జోష్ నింపుతుంది అనే మాటను అక్షరాలా నిజం చేస్తూ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో బిఆర్ఎస్ ఓటమిని ఉద్దేశించి కవిత చేసిన సోషల్ మీడియా పోస్టు బిఆర్ఎస్ కు పుండు మీద కారం జల్లినట్టయ్యింది.
“కర్మ హిట్స్ బ్యాక్” అంటూ దండం ఎమోజితో కవిత తన X వేదికగా చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలే సిట్టింగ్ స్థానంలో ఓడిపోయాము, రేవంత్ వ్యూహాల ముందు చతికిల పడ్డాము అనే ఓటమి అవమాన భారంలో ఉన్న బిఆర్ఎస్ ను ఇప్పుడు ఈ పోస్ట్ మరింత కుంగదీస్తుంది.
గతంలో నువ్వు చేసిందే ఇప్పుడు నీకు దక్కింది అనే భావనతో ఉండే ఈ పోస్టు కవితలో బిఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతకు అద్దం పట్టేలా ఉంది. బిఆర్ఎస్ పై ఆ పార్టీ ముఖ్య నాయకుల పై కవిత చేసిన రాజకీయ ఆరోపణలకు గాను ఆమెకు బిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ అనే రిటర్న్ గిఫ్ట్ దక్కింది.
దీనితో కవిత బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తో పాటుగా ఆ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి జాగృతి పేరు మీద సొంత రాజకీయం నడుపుతున్నారు. దీనితో ఇక బిఆర్ఎస్ కు ఇప్పటి వరకు ఉన్న రాజకీయ ప్రత్యర్థులకు తోడు కవిత కూడా యాడ్ అయినట్టయ్యింది.
కవిత..హరీష్ రావు, సంతోష్ రావు లను లక్ష్యంగా చేసుకుని వారు అవినీతి తిమింగలాలు అంటూ తీవ్రమైన ఆరోపణలు చేసారు, అలాగే బిఆర్ఎస్ లో తానూ కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప మరెవరిని నాయకుడిగా అంగీకరించను అంటూ కేటీఆర్ టార్గెటెడ్ గా పరోక్షంగా విమర్శలు సంధించారు.
ఈ నేపథ్యంలో కవిత తెగింపు బిఆర్ఎస్ ను ఆపార్టీ నాయకులను నిస్సహాయంలోకి నెట్టేశాయి. కవిత పై తిరిగి ఎదురుదాడి చెయ్యలేక, కవిత చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టలేక మౌనమే తన ఆయుధం అన్నట్టుగా బిఆర్ఎస్ సైలెన్స్ మోడ్ ను ఆశ్రయించింది.
ఇక ఇప్పుడు జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్తానంలో కూడా బిఆర్ఎస్ నుండి గులాబీ జెండా చేజారిపోవడంతో కవిత ఆన్ డ్యూటీ అన్నట్టుగా బిఆర్ఎస్ ను లక్ష్యం చేసుకుని మరిన్ని విమర్శలకు సిద్ధమవుతారు. మరి ఈసారి కూడా బిఆర్ఎస్ అధిష్టానం కవిత ఆరోపణలను, విమర్శలను లైట్ తీసుకుని మౌనంగానే ఉండిపోతారా.? లేక గర్జిస్తారా.?
Karma hits back !!!
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 14, 2025






