ప్రస్తుతం కవిత రాజకీయ బలం కల్వకుంట్ల అనే బ్రాండేనా.? లేదా గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలలో ఎంపీగా ఎమ్మెల్సీ గా ఆమె సాధించుకున్న రాజకీయ అనుభవమా.? లేక తనకున్న వాక్చాతుర్యమా.? లేదా కవిత కున్న ఆర్థిక బలమే కవిత తెలంగాణ రక్షణ సేన కు పెట్టుబడిగా మారిందా.? ఇలా కవిత కొత్త పార్టీ బలం చుట్టూ అనేక ప్రశ్నలు, మరెన్నో చర్చలు.
అయితే కవిత బలాలు కు తెలంగాణ రాజకీయాలలో అనేక పర్యాయపదాలు కనిపిస్తున్నప్పటికీ ఆమె రాజకీయ బలహీనతలు.? అంటే తనకి తెలంగాణ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్ కవిత బలహీనతా.? లేదా తనకు ఇన్ని దశాబ్దాల రాజకీయ అనుభవం ఇచ్చిన బిఆర్ఎస్ పార్టీ కవిత బలహీనతా.? లేక అన్న కేటీఆర్ తన రాజకీయ బలహీనతా.? లేక తన రాజకీయ బలానికి కారణమైన కల్వకుంట్ల బ్రాండే తన రాజకీయ బలహీనత అవుతుందా.?
అయితే ఈ ప్రశ్నలకు కవిత ఒకరకముగా తన చర్యలతో సమాధానం చెప్పకనే చెప్పారు. తండ్రి స్థాపించిన బిఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ వేటు తో బయటకు వచ్చినప్పటికీ కేసీఆర్, కవిత రాజకీయ బలహీనతగా మారతారా.? కవిత రాజకీయ దూకుడుకి తండ్రి అనే బంధం ఆమెకు అడ్డుగోడల నిలుస్తుందా.? పదేళ్లు తనకు రాజకీయ అవకాశం కల్పించిన పార్టీగా బిఆర్ఎస్ తో కవిత కున్న రాజకీయ బంధం ఆమె నోటికి తాళం వేస్తుందా.?
కేసీఆర్ టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ వరకు ఆ పార్టీతో కవితకున్న రాజకీయ అనుబంధం కవిత నోటికి సంకెళ్లు వెయ్యగలవా.? ఒకపక్క తండ్రి కేసీఆర్ ను కాదనుకుని మరోపక్క తన రాజకీయ ఎదుగుదలకు కారణమైన బిఆర్ఎస్ ను ఎదిరించి కవిత రాజకీయంగా ముందడుగు వేయగలదా.? అన్న కేటీఆర్ తో రాజకీయ యుద్ధం చేయగలరా.? అనుకున్న వారికీ కవిత చాల బలమైన సమాధానమే చెప్పింది.
కేసీఆర్ ప్రభుత్వంలో అనేక లక్షల కోట్ల అవినీతి జరిగిందని, హరీష్, సంతోష్ రావు ల కుటుంబాలు బంగారు కుటుంబాలుగా రూపాంతరం చెందాయంటూ కేసీఆర్ పై పరోక్ష విమర్శలు చేసారు. అలాగే కేసీఆర్ ని మరమనిషి అంటూ వ్యాఖ్యానించి, అన్న కేటీఆర్ కు నాయకత్వ లక్షణాలు లేవంటూ ఎద్దేవా చేస్తూ తన రాజకీయ అవసరం కోసం తండ్రి కేసీఆర్ తో అయినా యుద్దానికి సిద్ధం అంటూ ప్రకటించి కేసీఆర్ తో పాటుగా బిఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలను కూడా కవిత అవాక్కయ్యేలా చేసారు.
దీనితో కవిత రాజకీయ బలహీనతలో కుటుంబ సభ్యులు కానీ మాజీ పార్టీ కానీ లేదు అనేది స్పష్టమయింది. అయితే ప్రస్తుతానికి కవిత రాజకీయ బలహీనత అంటే బిఆర్ఎస్ లో కవిత సాధించిన రాజకీయ అనుభవం, ఆ పార్టీ అధికారంలో ఉన్నపుడు పార్టీలో ఆమె స్థాయి కవిత రాజకీయ బలహీనతలో మొదటిది.
ప్రస్తుతం గత బిఆర్ఎస్ ప్రభుత్వం పై ఆ ప్రభుత్వ పాలన పై కవిత చేస్తున్న అవినీతి ఆరోపణల పట్ల ప్రజల నుంచి బలమైన స్పందన రాకపోవడానికి అదే ప్రభుత్వంలో కవిత కూడా భాగస్వామి కావడమే. బిఆర్ఎస్ ఎంపీ గా, ఎమ్మెల్సీ గా, కేసీఆర్ కుమార్తెగా గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో కవిత పాత్ర కూడా కీలకం కావడమే ఇక్కడ కవిత బలహీనతగా మారింది.
ఇక అలాగే ఆమె పై ఉన్న ఢిల్లీ లిక్కర్ కేసు, అందుకు కవిత ఎదుర్కున్న అవినీతి ఆరోపణలు, ఆమె అనుభవించిన తీహార్ జైలు జీవితం ఆమె రాజకీయ జీవితం లో ఎప్పటికి చెరపని మచ్చగానే మిగిలిపోతుంది. అలాగే కవితను రాజకీయంగా టార్గెట్ చేసేందుకు ప్రత్యర్థి పార్టీలకు ఈ లిక్కర్ కేసు ఎప్పుడు ఒక దివ్యాయుధమే అవుతుంది.
లిక్కర్ కేసులో కవిత పేరు మీద ప్రచారమైన వేలకోట్ల అవినీతి ఆరోణలు కవిత రాజకీయ బ్రాండ్ ఇమేజ్ ను అమాంతం పాతాళానికి తెచ్చేసింది. కవిత బిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ వేటుతో బయటకు రావడానికి, టిఆర్ఎస్ అంటూ మరోకొత్త పార్టీ తో తెలంగాణ రాజకీయాలలో ఎంట్రీ కావడానికి కూడా మూలకారణం కవిత ఢిల్లీ లిక్కర్ కేసు అనే అభిప్రాయం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తుంది.
ఇలా కవిత తండ్రి కేసీఆర్ మొదలుకుని, అన్న కేటీఆర్ వరకు మామ హరీష్ మొదలుకుని బంధువు సంతోష్ వరకు అందరిని పొలిటికల్ గా టార్గెట్ చేస్తున్నారు, బిఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నారు. అయితే ఆ విమర్శలలో కొంత భాగం కవిత కూడా వర్తిస్తుంది అనేది కవిత గ్రహించాలి. తన బలం తో పాటు తన బలహీనతను గుర్తించి కవిత రాజకీయం చెయ్యాలి.





