రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనే నానుడి చాల బలంగా వినిపిస్తుంది, కనిపిస్తుంది కూడా. గతంలో ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన ల మధ్య రాజకీయ వైరాలు, అభిప్రాయ వైవిధ్యాలు చోటుసుకున్నప్పటికీ ఆ మూడు పార్టీలు 2024 లో తిరిగి పొత్తులో కొచ్చి కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి.
అలాగే రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెరాస ఏపీలో వైసీపీ రెండు పార్టీలు రాజకీయ ప్రత్యర్థులుగా మారాయి. తెలంగాణలో జగన్ కాలుమోపితే సహించేది లేదు అంటూ నాటి తెరాస క్యాడర్ జగన్ పై రాళ్ల దాడికి యత్నించారు. కట్ చేస్తే 2019 ఎన్నికలలో ఒకరి పార్టీ గెలుపు కోసం మరొకరు తెరచాటు రాజకీయం నడిపారు.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం గతంలో టీడీపీ నేతగా ఎదిగి బాబు శిష్యుడిగా పార్టీలో ఒదిగారు. కానీ ఇప్పుడు టీడీపీ కి రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా నిలిచారు. ఇక పురందరేశ్వరి రాజకీయ ప్రస్థానం మొత్తం ఇంచుమించుగా కాంగ్రెస్ లోనే ఉన్నప్పటికీ రాష్ట్ర విభజనతో బీజేపీ కి షిఫ్ట్ అయ్యారు.
ఇలా రాజకీయ నాయకుల రాజకీయ ప్రయాణం అనేది ఎల్లప్పుడూ ఒకే రకంగా స్థిరంగా, స్థిమితంగా ఉండదు, ఉండలేదు. అయితే ఇప్పుడు బిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ వేటు తో బయటకొచ్చిన కవిత, తండ్రి కేసీఆర్ ని కాదని, అన్న కేటీఆర్ ని వద్దని జాగృతి పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు.
అయితే బిఆర్ఎస్ నుంచి కవిత కు సస్పెన్షన్ లేఖ చేతికి చేరగానే కవిత గులాబీ కారు తరుపున వచ్చిన ఎమ్మెల్సీ పదవిని కూడా రాజీనామాతో వదులుకున్నారు. హరీష్, సంతోష్ ల పై కవిత రాజకీయ ఆరోపణలు, కేసీఆర్, కేటీఆర్ రాజకీయం పై కవిత అసంతృప్తి కలిపి ఆమెను బిఆర్ఎస్ కు దూరం చేసాయి.
కవిత బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా ఇంకా కవిత రాజీనామాను బిఆర్ఎస్ అధికారికంగా ధ్రువీకరించలేదు, అంగీకరించలేదు. దీనితో ఏనాటికైనా కవిత తన ఆవేశాన్ని, అసహనాన్ని వదులుకుని గులాబీ గూటికి చేరుతుందేమో అన్న ఆశ బిఆర్ఎస్ ను అడ్డుకుంటుందా.?
అవును చెప్పలేము రాజకీయాలలో ఎప్పుడు ఎవరెవరు మిత్రులవుతారో.? ఎవరెవరి మధ్య రాజకీయ శత్రుత్వం మొదలవుతుందో.? చెప్పడమే కాదు ఊహించడం కూడా అసాధ్యమే..!




