పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నప్పుడు గుర్తుకురాని ఎన్నో విషయాలు బయటకు గెంటేసిన తర్వాత గుర్తుకు వస్తుంటాయి. అప్పుడే ప్రజల మద్దతు చాలా అవసరమని గుర్తించి వారి వద్దకు వెళ్తారు. తనకు జరిగిన అన్యాయం గురించి విడమరిచి చెప్పుకున్న తర్వాత ‘ఈ అన్యాయం నాకు మాత్రమే కాదు… మీకూ జరిగిందని’ ఒప్పించే ప్రయత్నం చేస్తారు. కనుక అందరం కలిసి పోరాడుదామని నచ్చజెపుతారు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత చేస్తున్నది కూడా ఇదే!
తండ్రి, అన్న ఆమెని పార్టీ నుంచి బయటకు గెంటేసిన తర్వాత జాగృతి కండువా వేసుకొని జనం బాట పట్టారు. శనివారం నిజామాబాద్‌లో ఆమె ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెలంగాణ అమరవీరులు 1,200 మంది అని మనమే చెప్పి వారిలో 580 మందికి మాత్రమే 10 లక్షలు నగదు, ప్రభుత్వోద్యోగాలు ఇచ్చాము. మిగిలిన వారికి కూడా న్యాయం చేయాలని నేను అంతర్గత చర్చలలో పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదు.
అందుకు నేను అమరవీరుల కుటుంబాలకు క్షమాపణలు చెపుతున్నాను. వారందరికీ న్యాయం చేసేందుకు నేను పోరాడుతాను. కేసీఆర్ హయంలో కొంత అభివృద్ధి జరిగింది. కొన్ని సాధించుకున్నాము. కానీ ఇంకా చాలా జరగాల్సి ఉంది. వాటన్నిటి కోసం మనందరం కలిసి పోరాడుదాము,” అని కవిత అన్నారు.
పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆమె వాటిని వెనకేసుకు వస్తూ ప్రత్యర్ధులపై నిప్పులు చెరిగేవారు. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత తండ్రి, అన్న పాలనలో లోపాలను ఎత్తి చూపిస్తున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెపుతున్నారు. అంటే నాటికీ, నేటికీ ఆమె మాటల్లో ఈ మార్పు గమనిస్తే ఆమె అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని అర్ధమవుతుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమెను జైల్లో పెట్టినప్పుడు తెలంగాణ ఆడబిడ్డలందరికీ అన్యాయం జరిగిందన్నట్లే మాట్లాడారు. ఆమె అవినీతికి పాల్పడి ఈ కేసులో చిక్కుకొని జైలుకి వెళితే ఈ కేసుతో తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం?అని బీజేపి ప్రశ్నించేది.
ఇప్పుడు ఆమెను సొంత తండ్రి, అన్న అన్యాయంగా బయటకు గెంటేస్తే తెలంగాణ ప్రజలకు న్యాయం జరగలేదనడం కూడా అలాగే ఉంది కదా?వారి ఆస్తులు, వ్యాపారాలు, రాజకీయాలు, కుటుంబంలో గొడవలతో తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం? అధికారంలో ఉన్నప్పుడు తమని పట్టించుకోని ఆమె కోసం వారెందుకు పోరాడాలి?
తొలిరోజు పర్యటనలోనే ఆమె ఈవిదంగా మాట్లాడినప్పుడు, నాలుగు నెలల పాటు సాగే ఈ జనం బాట కార్యక్రమంలో మరిన్ని విమర్శలు చేస్తారో?అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆమెను ఏవిదంగా ఎదుర్కొంటుందో?
కానీ ఈవిదంగా కవిత-బీఆర్ఎస్ పార్టీ మద్య యుద్ధం మొదలైతే అది షర్మిల-వైసీపీ మద్య యుద్ధంలాగే సాగుతుంది. కనుక దాని ప్రభావం, ముగింపు కూడా ఇంచుమించు అలాగే ఉండవచ్చు.




