తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఇద్దరిలో కొన్ని సారూప్యతలు ఉన్నాయి. ఒకప్పుడు ఇద్దరూ సామాన్య ప్రజల మద్య తిరిగినవారే… ఉద్యమాలు చేసినవారే. కానీ ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ప్రజలకు దూరంగా ఉన్నారు.
కేసీఆర్ ప్రగతి భవన్, ఫామ్‌హౌస్‌కి పరిమితమైతే, జగన్ తాడేపల్లి ప్యాలస్‌కు పరిమితమయ్యారు. ఇద్దరూ ప్రతిపక్షాల పట్ల చాలా నిరంకుశంగా, కర్కశంగానే వ్యవహరించారు.
ఇదివరకు ప్రగతి భవన్ దాటి బయటకు ఎందుకు రావడం లేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే, “ముఖ్యమంత్రి బాధ్యత చక్కటి పాలన అందించడమే తప్ప ప్రజల మద్య తిరగడం కాదు,” అని సమర్ధించుకున్న కేసీఆరే, శాసనసభ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఫామ్‌హౌస్ నుంచి బయటకువచ్చి ప్రజల మద్యకు, రైతుల వద్దకు వెళుతున్నారు.
ఈసారి ఏపీ శాసనసభ ఎన్నికలలో వైసీపి ఎదురీదబోతోందని ముందే గ్రహించిన సిఎం జగన్ కూడా తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు వచ్చి సిద్దం బస్సు యాత్రలు చేస్తూ ప్రజల మద్యకు వస్తున్నారు.
కేసీఆర్, జగన్ ఇద్దరికీ కష్టకాలం మొదలయ్యేసరికి ఇంతకాలంగా తాము అనుసరించిన విధానాలు, ప్రజల పట్ల తమ వైఖరి సరైనకావని గుర్తించిన్నట్లే ఉన్నారు. అందుకే ఇద్దరూ బస్సు యాత్రలు చేస్తూ ప్రజల మద్యకు వెళుతున్నారిప్పుడు.
అయితే ఇద్దరి మద్య కొన్ని వైరుధ్యాలు కూడా ఉన్నాయి. కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పధకాలను సమానంగా ముందుకు తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విదాల అభివృద్ధి చేసుకుంటే, జగన్ కేవలం సంక్షేమ పధకాలతోనే ముందుకు సాగుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా అప్పులపాలు చేశారు.
గమ్మతేమిటంటే, కేసీఆర్ ఆంధ్రా ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారని తెలిసి ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఆయనతో స్నేహమే కోరుకున్నారు. కానీ జగన్ ఆంధ్రాని దెబ్బ తీసుకొంటూ, తెలంగాణ ఆర్ధిక, పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడినందుకుగాను కేసీఆర్ ఆయనతో సఖ్యతగా ఉంటున్నారు! చంద్రబాబు నాయుడు వారిద్దరి ఉమ్మడి రాజకీయ శత్రువు కావడం కూడా వారిని కలిపి ఉంచుతోందని చెప్పవచ్చు.
తాజాగా కేసీఆర్ సోషల్ మీడియాలో కూడా ప్రవేశించారు. @KCRBRSPresident అనే హ్యాండిల్‌తో ట్విట్టర్‌లో ఖాతా ప్రారంభించారు. అలాగే ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఖాతాలు తెరిచారు. అంటే ఎన్నికలలో విజయం సాధించేందుకు తన మేదస్సు, వ్యూహాలు మాత్రమే సరిపోవని, సోషల్ మీడియా అవసరం కూడా ఉందని కేసీఆర్ గుర్తించిన్నట్లే ఉన్నారు.




