అడుగడుగునా అవమానాలు, అణచివేతలు, వివక్షలతో తల్లడిల్లిపోయిన తెలంగాణ ఆత్మగౌరవానికి ఊపిరిపోసిన పార్టీ అది. 60 ఏళ్ళ తెలంగాణ కలను సాధింది 4కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీ అది. యావత్ ప్రపంచం చూపు తెలంగాణ రాష్ట్రం వైపు కేంద్రీకృతం అయ్యేట్లు చేసిన పార్టీ అది. ఆ పార్టీయే తెలంగాణ రాష్ట్ర సమితి. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి గా రూపాంతరం చెంది యావత్ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే దృఢనిశ్చయంతో ఉరకలు వేస్తూ ముందుకు దూసుకుపోతుంది బిఆర్ఎస్.
బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి సరిగ్గా నేటికి 22 సంవత్సరాలు పూర్తయింది. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలను తెరాస భవన్ లో ఘనంగా నిర్వహించారు. బిఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు.
టిఆర్ఎస్ నుండి బిఆర్ఎస్ గా మారిన తరువాత జరుగుతున్న తొలి సమావేశం కావడం విశేషం. ఈ ఆవిర్భావ వేడుకలకు మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, జెడ్పి చైర్మన్ లు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులతో పాటు మరికొంతమంది ముఖ్యనేతలు పాల్గొన్నారు.
సభ ప్రారంభం నుండి కేసిఆర్ ప్రధానంగా రానున్న ఎన్నికల అంశం పైనే చర్చ ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో అవలంభించాల్సిన తీరు, నిర్వహించాల్సిన కార్యక్రమాలు, ప్రతిపక్ష పార్టీల విమర్శలకు ధీటుగా కౌంటర్లు ఇచ్చే అంశంపై సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగులు, విద్యార్థులు మరియు యువత పట్ల వ్యవహరించాల్సిన తీరుపై కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ సమావేశం సాయంత్రం వరకు కొనసాగనుంది.



