తెలంగాణలో అధికార బిఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో పార్టీ ప్రధాన కార్యాలయంలో సిఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించుకొని, జాతీయ రాజకీయాలలో తమ పార్టీ విధానాలను తీర్మానాలుగా ఆమోదించుకొన్నారు.
అనంతరం తెలంగాణ మంత్రులు మీడియా ముందుకు వచ్చినప్పుడు, “మీ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడి పెడతానని హంగామా చేసింది కదా?ఎందుకు వెంకంజవేసింది?కర్నాటక శాసనసభ ఎన్నికలలో మీ పార్టీ పోటీ చేస్తుందన్నారు కదా ఎందుకు పోటీ చేయడం లేదు? పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రం ఏపీకి వెళ్ళకుండా మహారాష్ట్రలో ఎందుకు తిరుగుతున్నారు?ఏపీలో మీ పార్టీ పోటీ చేస్తుందన్నారు కదా చేస్తుందా చేయడా? ఏపీలో కేసీఆర్ బహిరంగసభ పెడతానన్నారు కదా ఎప్పుడు పెడతారు?”అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
అయితే కేసీఆర్ శిక్షణలో మంత్రులందరూ మంచి మాటకారులుగా తీర్చిదిద్దబడ్డారని విలేఖరుల ప్రశ్నలకు ఏమాత్రం తడబడకుండా వారు చెప్పిన రి జవాబులు వింటే ఎవరైనా అంగీకరిస్తారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్: టెండర్ ప్రక్రియలో కొన్ని నిబందనల కారణంగానే మేము ఉండిపోవలసి వచ్చింది. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది,” అని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం లక్షల కోట్ల విలువగల కాంట్రాక్టులు చేయించింది. కనుక కేసీఆర్‌కి స్టీల్ ప్లాంట్‌లో టెండర్లు వేయడానికి ఎటువంటి నిబంధనలు ఉంటాయో తెలియవని అనుకోలేము. అయినా అన్ని ఆన్‌లైన్ అందుబాటులోనే ఉన్నప్పుడు నిబందనలు చూడకుండానే సింగరేణి అధికారులను పరుగులు పెట్టించారా? వారు స్టీల్ ప్లాంట్‌లో పర్యటించి, తాము టెండర్లు వేసేందుకు మరో 5 రోజులు గడువు పొడిగించాలని కోరారు కదా? ఆ తర్వాత వారు లాభనష్టాలను లెక్కలు వేసుకొని సిఎం కేసీఆర్‌కు నివేదిక ఇచ్చారు. సింగరేణికి స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడి పెట్టేంత శక్తి సామర్ధ్యాలు లేవు కనుకనే వెనక్కు తగ్గిందని అందరికీ తెలుసు. కానీ నిబందనల కారణంగా వెనక్కు తగ్గాల్సి వచ్చిందని లౌక్యంగా చెపుతున్నారు. అది వారికే చెల్లు!
కర్ణాటక ఎన్నికలలో పోటీ చేసేందుకు తగినంత సమయం లేకపోవడం వలన పోటీకి దూరంగా ఉండిపోవలసి వచ్చిందని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పడం వారి లౌక్యానికి మరో నిదర్శనం. టిఆర్ఎస్‌ను బిఆర్ఎస్‌గా మార్చిన తర్వాత కర్ణాటకలోనే మొదట పోటీ చేస్తామని కుమారస్వామి సాక్షిగా కేసీఆర్ చెప్పారు. అంటే అప్పటికి చాలా సమయం ఉందని అర్దం అవుతోంది. కానీ ఇప్పుడు సమయం తక్కువగా ఉందని చెపుతున్నారు!ఎక్కడ నెగ్గాలో కాదు… ఎక్కడ తగ్గాలో కూడా కేసీఆర్‌కు బాగా తెలుసని సెల్ఫ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చుకొన్నారు. ఇలా సమర్ధించుకోవడం కూడా వారికే చెల్లు!
ఏపీకి రాకుండా మహారాష్ట్రలో చక్కర్లు కొడుతుండటంపై అడిగిన ప్రశ్నకు మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ, “కంగారెందుకూ? దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు మమ్మల్ని మా రాష్ట్రానికి ముందు రమ్మంటే కాదు… ముందు మారాష్ట్రానికి రావాలని కోరుతున్నారు. ఎందుకంటే మా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పధకాలను చూసి మేము వస్తే వాళ్ళ రాష్ట్రాలు కూడా అలా అభివృద్ధి చెంది సంక్షేమ పధకాలు లభిస్తాయని ప్రజలు ఆశపడుతున్నారు. ఏపీ ప్రజలు కూడా అలాగే ఆశపడుతూ మాకు ఘనస్వాగతం చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. కనుక ఏపీలో కూడా తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఏపీలో అన్ని శాసనసభ, లోక్‌సభ సీట్లకు పోటీ చేస్తుంది. ఒక్క ఏపీలోనే కాదు… దేశంలో అన్ని రాష్ట్రాలలో ఈసారి బిఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది. కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుంది,” అని చెప్పారు. కర్ణాటకలో జెడి(ఎస్)తో కలిసి పోటీ చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ వెనకంజ వేసిన బిఆర్ఎస్ పార్టీ, దేశంలో అన్ని రాష్ట్రాలలో పోటీ చేసి గెలుస్తుందని చెప్పుకోగల మాటకారితనం బిఆర్ఎస్ నేతలకే ఉంది.
త్వరలోనే కేసీఆర్ ఏపీలో తప్పకుండా భారీ బహిరంగసభ నిర్వహించి తన సత్తా చూపిస్తారని మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.



