వారసులపై చంద్రబాబు, కేసీఆర్‌ రాజకీయాల ఎఫెక్ట్

KCR and Chandrababu Naidu political comparison with KTR and Nara Lokesh

ఏ రంగంలో ఉన్నవారైనా తమ పిల్లలు కూడా ఆ రంగంలో రాణించాలని కోరుకుంటారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ కూడా కొడుకు కేటీఆర్‌, కూతురు కవితలను తెచ్చారు. వారు రాణించినా, కేసీఆర్‌ చేసిన రాజకీయాలే వారికి శాపంగా మారాయి. ఊహించని విధంగా వారి జీవితాలు తలకిందులు అయిపోయాయి.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్‌ను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. ఆయన బాగా రాణిస్తూ, భవిష్యత్తులో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదుగుతున్నారు.

ADVERTISEMENT

కేసీఆర్‌, చంద్రబాబు ఇద్దరూ మేధావి నాయకులే. కానీ ఈ కుందేలు-తాబేలు పందెంలో కేసీఆర్‌ ఓడిపోయి, తన వారిని కూడా ఓడించుకోగా, చంద్రబాబు గెలిచి తన వారిని కూడా గెలిపించుకున్నారు. కేసీఆర్‌ బీజేపీ (కేంద్రం)తో యుద్ధం చేసి గెలవాలనుకున్నారు.

అటువంటప్పుడు దానికి బద్ధ శత్రువు, బలమైన శత్రువైన కాంగ్రెస్‌తో స్నేహం చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో? కానీ తెలంగాణ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని రెండు జాతీయ పార్టీలతో యుద్ధం చేసేందుకు సిద్దపడ్డారు. కానీ కేవలం 7-8 ఎంపీలున్న ఓ ప్రాంతీయ పార్టీ రెండు జాతీయ పార్టీలతో యుద్ధం చేసి గెలవగలదనుకోవడం అతిశయం, అహంభావమే. ఆ కారణంగానే కేటీఆర్‌, కవిత ఇద్దరి రాజకీయ భవిష్యత్తు కూడా దెబ్బతింది.

రాజకీయాలలో తప్పులు జరగడం సహజం. కానీ వాటిని గుర్తించి, అంగీకరింఛి సరిదిద్దుకుంటే చంద్రబాబు నాయుడులా రాణిస్తారు. అహం అడ్డొచ్చి దిద్దుకోకపోతే కేసీఆర్‌, జగన్‌లాగ నష్టపోతారు.

చంద్రబాబు నాయుడు ఈ రాజకీయ వాస్తవాన్ని బాగా అర్ధం చేసుకొని ఒక మెట్టు దిగి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. మంచి ఫలితాలు సాధిస్తున్నారు. కొడుకు నారా లోకేష్‌ రాజకీయ భవిష్యత్తుకి రాచబాటలు పరుస్తున్నారు.

కేసీఆర్‌ అందరినీ శత్రువులుగా మార్చుకుంటే చంద్రబాబు నాయుడు అందరినీ కలుపుకుపోతూ, అందరితో కలిసిపోతూ విజయాలు సాధిస్తున్నారు.

గమ్మతైన విషయం ఏమిటంటే, అక్కడ కేటీఆర్‌, ఇక్కడ నారా లోకేష్ ఇద్దరూ తండ్రి బాటలోనే నడుస్తున్నారు. కేసీఆర్‌ చేసిన తప్పులనే కేటీఆర్‌ కూడా చేస్తూ శత్రువుల జాబితా ఇంకా పెంచుకుంటుంటే, నారా లోకేష్ తండ్రి బాటలో నడుస్తూ అందరినీ కలుపుకుపోతూ, అందరితో కలిసిపోతూ లభించిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు జాతీయస్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

కనుక రాజకీయాలలో ఒక తరం వారి తప్పోప్పుల ప్రభావం ఎలాగూ వారి వారసులపై పడుతుంది. కానీ వారి వారసులు కూడా ఆ తప్పులను పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతుండాలని కేటీఆర్‌, లోకేష్ రాజకీయ జీవితాలు నిరూపిస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories