తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ తప్ప మరే పార్టీ ఉండకూడదని కోరుకొంటున్న కేసీఆర్, అందుకోసం ఒక్కో ప్రతిపక్షపార్టీపై ఒక్కోరకం ఆరోపణ, ఒక్కో రకం ముద్రవేసి అవన్నీ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుతినేందుకే ఉన్నాయని వాదిస్తుంటారు. అయితే తాను మాత్రం ఏపీతో సహా అన్ని రాష్ట్రాలలో బిఆర్ఎస్ పార్టీని విస్తరించవచ్చని, ఎందుకంటే దేశంలో మరే పార్టీ, ప్రభుత్వానికి పరిపాలన చేతకాదని, అభివృద్ధి చేయలేవని, తాను మాత్రమే అభివృద్ధి చేయగలనని గొప్పగా చెపుతుంటారు.
ఇందుకు ఉదాహరణగా ఆయన ఏపీ, తెలంగాణలలో పరిస్థితులను పోల్చి చూపుతూ, “ఒకప్పుడు ఏపీలో ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో మూడు ఎకరాలు కొనగలిగేవారు. కానీ ఇప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఏపీలో మూడెకరాలు కొనవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో అంతగా అభివృద్ధి జరిగింది,” అని సగర్వంగా పలుమార్లు చెప్పుకొన్నారు.
అది వాస్తవమే కనుక ఏపీలో ఎవరూ ఆయనను తప్పు పట్టలేదు. ఈ నాలుగేళ్ళ వైసీపీ పాలనలో ఏపీలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడటంతో రైతుల పరిస్థితి కూడా దయనీయంగా మారింది.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిన్న ఇదే విషయం చెపుతూ, “ఏపీలో అభివృద్ధి కుంటుపడటం వలన భూముల ధరలు పెరగలేదు. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆ సొమ్ముతో ఇక్కడ ఏపీలో 50-100 ఎకరాలు కొనవచ్చాంటే ఏపీలో ఎంత దయనీయ పరిస్థితులున్నాయో అర్దం చేసుకోవచ్చు. ఏపీలో భూములు ధరలు పెరగకపోయినా ప్రభుత్వం వాటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు మాత్రం భారీగా పెంచేసి దోచుకొంటోంది,” అని అన్నారు.
చంద్రబాబు నాయుడు ఏపీలో నెలకొన్న పరిస్థితులను వివరించడానికే ఈవిదంగా చెప్పారని అర్దమవుతూనే ఉంది. కానీ ఆయన ప్రజలను రెచ్చగొట్టేందుకే ఆవిదంగా మాట్లాడి కొత్త కుట్రకు తెరతీస్తున్నారంటూ బిఆర్ఎస్ అధికార పత్రిక నమస్తే తెలంగాణ విషం కక్కడం మొదలుపెట్టింది.
చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఐటి రంగానికి పునాది వేసి ఎంతగానో అభివృద్ధి చేసిన సంగతి అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ అభివృద్ధికి చేసిందేమీ లేదని బిఆర్ఎస్ నేతలు వాదిస్తుంటారు. ఎంత అడిగితే అంతా ఇవ్వగల కామధేనువు వంటి హైదరాబాద్ నగరమే నేటికీ తెలంగాణకు ప్రధాన ఆర్ధికవనరుగా నిలుస్తోందని అందరికీ తెలుసు.
అయితే కేసీఆర్ ఆత్మని, ఆలోచనలని, ఆయన కోరికలను అందంగా ఆవిష్కరించే నమస్తే తెలంగాణ కూడా అదేవిదంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను వక్రీకరించి చూపింది. ఆయనకు తెలంగాణ అంటే అసూయ, చులకన, గిట్టదని అన్ని విధాలా అభివృద్ధి చెందిన తెలంగాణపై ఆయన కన్నువేశారంటూ ఏవేవో వ్రాసి పడేసింది.
ఆనాడు కేసీఆర్, మంత్రులు ఏపీ పరిస్థితుల గురించి చులకనగా మాట్లాడినప్పుడు, అది తెలంగాణలో జరిగిన అభివృద్ధిని పోల్చి చూపుకోవడం కోసమే అని గట్టిగా సమర్ధించుకొన్నారు. కానీ అదే మాట ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే రెండు రాష్ట్రాలు ప్రజలను రెచ్చగొట్టడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడానికి అని వక్రభాష్యం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.
తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి, టిడిపి లేదా మరో పార్టీ ఎన్నికలలో పోటీ చేస్తే రాష్ట్రానికి పెను ప్రమాదం పొంచి ఉంది. వాటి మాయమాటలను నమ్మవద్దని చెప్పే కేసీఆర్, ఏపీలో బిఆర్ఎస్ పార్టీని స్థాపించమని వేలమంది విజ్ఞప్తులు చేస్తున్నారు. తన రాక కోసం ఏపీ ప్రజలు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారని గొప్పలు చెప్పుకొంటారు.
మరి అటువంటప్పుడు గుంటూరులో బిఆర్ఎస్ కార్యాలయం నిర్మిస్తే దాని ప్రారంభోత్సవానికి ఎందుకు రాలేదు? ఎక్కడో ఢిల్లీ, పంజాబ్, బీహార్, మహరాష్ట్రలలో చక్కర్లు కొడుతున్న కేసీఆర్, కూతవేటు దూరంలో ఉన్న ఏపీలో అడుగుపెట్టడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు?అంటే జవాబు అందరికీ తెలుసు.
ఏపీని, ఏపీ పాలకులను, ప్రజలను, చివరికి వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లను కూడా కేసీఆర్ దారుణంగా కించపరిచారు. దేశాన్ని ఉద్దరిస్తానని బయలుదేరుతున్న కేసీఆర్ నేటికీ ఏపీని ముప్పతిప్పలు పెడుతూనే ఉన్నారు. ఏపీ రాజకీయాలలో వేలుపెట్టి రాష్ట్రాన్ని ఈ దుస్థితికి తీసుకువచ్చిన క్రెడిట్ కూడా ఆయనదే అని అందరికీ తెలుసు.
కనుక ఎవరు ఏ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారో, ఎవరు దెబ్బతీశారో అందరికీ తెలుసు. కానీ నందిని పంది, పందిని నంది అని నమ్మించగల వాక్చాతుర్యం గల కేసీఆర్‌తోనే దేశ ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రా ప్రజలు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.



