తెలంగాణ రాజకీయాలలో వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఓ విఫల రాజకీయ ప్రయోగమని ఎన్నికలనాటికి స్పష్టమైపోయింది. గట్టు రామచంద్రరావు వంటి పార్టీలో నేతలే ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి, తమ పార్టీని బిఆర్ఎస్‌లో విలీనం చేసేశారు. కనుక ఆమె రాజకీయ భవిష్యత్ ఏమిటో ఆమెకే తెలియని స్థితిలో ఉన్నారని చెప్పవచ్చు.
ఆమె మద్దతు ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఆమెను పట్టించుకొనే నాధుడే లేడు. కనుక ఆమె ఇంకా కాంగ్రెస్ కోసం ఏదో చేస్తారని అనుకోవడం అవివేకమే. కానీ రాజకీయాలలో చాణక్యుడని పేరుగాంచిన తెలంగాణ సిఎం కేసీఆర్, ఆమె నర్సంపేట నియోజకవర్గంలో బిఆర్ఎస్ అభ్యర్ధిని ఓడించేందుకు డబ్బు కట్టలు పంచుతున్నారని తీవ్ర ఆరోపణ చేశారు.
కేసీఆర్ అక్కడ ఎన్నికల సభలో మాట్లాడుతూ, “వైఎస్ షర్మిల అనే ఆమె ఇక్కడ పాదయాత్ర చేస్తున్నపుడు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అనుచరులు నిరసన తెలిపినందుకు పగ బట్టి, ఈ ఎన్నికలలో ఆయనను ఓడించేందుకు డబ్బు కట్టలు పంచిపెడుతుందట. పరాయి రాష్ట్రం వాళ్ళు ఇక్కడకొచ్చి డబ్బు పంచి పెట్టి మీ అందరికీ మందుపోసి మీకోసం, మీ నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేస్తున్న సుదర్శన్ రెడ్డిని ఒడిస్తామంటే చూస్తూ ఊరుకొందామా?సమైక్యవాదులను తరిమికొట్టి మన పార్టీని, రాష్ట్రాన్ని కాపాడుకోవద్దా?” అంటూ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేశారు.
గత ఏడాది వైఎస్ షర్మిల నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నపుడు సుదర్శన్ రెడ్డి అనుచరులు ఆమె బృందంపై దాడి చేసి ఆమె కారుని తగులబెట్టారు. అప్పుడు ఆమె దానిని హైలైట్ చేసుకొని మీడియా దృష్టిలో పడ్డారు కూడా.
అయితే ఇప్పుడు ఆమె వెంట పార్టీ నేతలు ఎవరూ లేరు. కాంగ్రెస్ కూడా ఆమెను పట్టించుకోవడం లేదు. షర్మిల రాజకీయ పరిస్థితి చాలా దయనీయంగా ఉందిప్పుడు. ఈ పరిస్థితులలో ఆమె బిఆర్ఎస్ అభ్యర్ధిని ఓడించేందుకు డబ్బు కట్టలు ఖర్చు చేస్తారని కేసీఆర్ వంటి రాజకీయ నాయకుడు చెప్పడం చాలా హాస్యస్పదంగా ఉంది. అని అనిపిస్తున్నా ఆ నియోజకవర్గంలో తన పార్టీ అభ్యర్ధికి ప్రజల మద్దతు కూడగట్టి గెలిపించుకొనేందుకే కేసీఆర్ ఈ సెంటిమెంట్ అస్త్రాన్ని కూడా తీసి వాడేశారని భావించవచ్చు.
వైఎస్ షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నప్పుడు నిత్యం ఎంతగా విమర్శించినా, ఎన్ని ఆరోపణలు చేసినా పట్టించుకోని కేసీఆర్, ఇప్పుడు తొలిసారిగా షర్మిల పేరు పలికి విమర్శించడం విశేషమే అనుకోవాలి.




