తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ముఖచిత్రం వంటివారు. ఆయనే ఆ పార్టీకి శక్తి, యుక్తి, భక్తి అన్నీను. అందుకే కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్ధుల తీరు ఎలా ఉన్నప్పటికీ ప్రజలు కేసీఆర్ మొహం చూసే వారికి ఓట్లేస్తుంటారు.
అయితే కేసీఆర్ అహంభావమే ఇప్పుడు ఆ పార్టీకి శాపంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రతిపక్ష నేతలందరూ ఆయన తెలంగాణను అభివృద్ధి చేయలేదని విమర్శించడం లేదు. చేయలేరు కూడా.
‘పదేళ్ళ అహంభావాన్ని, పదేళ్ళ నిరంకుశత్వాన్ని గద్దె దించాలని’ మాత్రమే అంటున్నారు. అంటే బిఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలలో ఓడిపోతే అందుకు కేసీఆర్ అహంభావమే ప్రధాన కారణమని భావించాల్సి ఉంటుంది. ఒక ప్రభుత్వం, ఒక పార్టీ ఓ వ్యక్తి అహంభావం వలన నష్టపోతే అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది?
ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపికి ముఖ చిత్రం వంటివారే. ఆయన బలాలు, బలహీనతలే ఆ పార్టీని కాపాడుతున్నాయి. కూల్చేయవచ్చు కూడా.
నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిలో చూసి ఓట్లు వేసి గెలిపించారని చెప్పవచ్చు.
స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలతో చాలా స్నేహపూర్వకంగా ఉండేవారు. మీడియాతో, ప్రతిపక్షాలతో చాలా సంయమనంతో వ్యవహరించేవారు. ఈ గుణాలే ప్రజల గుండెల్లో ఆయనకు శాస్విత స్థానం కల్పించాయి. ఆయనతో రాజకీయ వైరం కలిగిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సైతం ఆయనను పలు సందర్భాలలో మెచ్చుకొన్నారు.
కనుక జగన్మోహన్ రెడ్డిలో కూడా ఆయనను చూస్తామనే ఆశతోనే ప్రజలు చంద్రబాబు నాయుడుని కాదని అధికారం కట్టబెట్టారు. కానీ ఈ నాలుగున్నరేళ్ళలో ఆయన విశ్వరూపం చూసి ప్రజలే కాదు… ప్రతిపక్షాలు కూడా హడలిపోతున్నాయి.
అది అమరావతి కావచ్చు… పోలవరం కావచ్చు. ఏ విషయంలోనూ తన మాటే చెల్లాలనుకొన్నారు తప్ప తన నిర్ణయాల వలన రాష్ట్రానికి కలుగుతున్న నష్టాన్ని, అపకీర్తిని సిఎం జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. అభివృద్ధి విషయంలోనే కాదు… మీడియాతో, ప్రతిపక్షాలతో వ్యవహరించే తీరు కూడా ప్రజలలో ఆయన పట్ల వ్యతిరేకత పెరిగేందుకు కారణమవుతోందని గ్రహించిన్నట్లు లేదు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి, దేశంలోకే అత్యంత శక్తివంతుడైన రాజకీయ నాయకులలో ఒకరిగా ఎదిగిన కేసీఆర్ అంతటివాడు నేడు ఎన్నికలలో ఎదురీదుతున్నారు. రేపు ఏపీ శాసనసభ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపికి కూడా అటువంటి పరిస్థితి రాకుండా ఉంటుందా?ఆలోచిస్తే మంచిది.




