అక్టోబర్ లో ఎన్నికల నోటిఫికేషన్: హింట్ ఇచ్చిన కేసీఆర్

 KCR Election Notificationహైదరాబాద్ తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ 22 వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ సర్వ సభ్య సమావేశం కూడా అట్టహాసంగా జరిగింది. గత సమావేశాలకంటే భిన్నంగా కేసీఆర్ వ్యవహారశైలి, ప్రసంగాలు ఉన్నాయని, పార్టీ శ్రేణులందరికి ధైర్యం చెప్తూ కొత్త జోష్ నింపారని ఆవిర్భావ సభకు హాజరైన నేతల నుండి వస్తున్న స్పందన.

ఎన్నికలకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉందని. అక్టోబర్ లోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని, కనుక నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల్లోనే ఉండాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పోగొట్టే విధంగా ప్రజలతో మమేకం కావాలని, సమస్యలున్నాయని ప్రజలు చెప్పే కంటే ముందే నాయకులే స్వయంగా ప్రజలవద్దకు వెళ్ళి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని కేసీఆర్ నేతలను ఆదేశించారు.

ADVERTISEMENT

ఎమ్మేల్యే, యం.పి లు నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని, పార్టీ క్యాడర్ తో కలసి బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, తద్వారా రాష్ట్రంలో వచ్చిన మార్పులు, గత ప్రభుత్వాలకు బిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పాలన మధ్య వ్యత్యాసం మరియు రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ తీసుకురాబోయే విప్లవాత్మక మార్పుల గురించి క్షుణ్ణంగా ప్రతీ ఒక్కరికీ వివరించాలని, పార్టీ ప్రచారం విరివిగా చేయాలని కేసీఆర్ ఆ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఎమ్మెల్యే, యం.పి లు లేని నియోజకవర్గాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ లు, ఎంపిపి లు, జెడ్.పి.టి.సి లు భాద్యతలు తీసుకుని ప్రభుత్వ కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని కేసీఆర్ ఆపార్టీ నేతలకు సూచనలు చేశారు. రాబోయే 4 నెలలు చాలా కీలకం అని, గట్టిగా కష్ట పడితే భారీ మెజారిటీతో విజయం సాధించవచ్చని కేసీఆర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో 63 సీట్లు వచ్చాయని, రెండవసారి జరిగిన ఎన్నికల్లో 88 సీట్లు సాధించామని, జరగబోయే ఎన్నికల్లో 100 కంటే ఎక్కువ సీట్లు సాధించాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు హితబోధ చేశారు. పార్టీ విస్తృత ప్రచారం కోసం అవసరమైతే సినిమాల నిర్మాణం తో పాటు, పార్టీ ఆధ్వర్యంలోనే టి.వి ఛానల్ లను కూడా నడపవచ్చని కేసీఆర్ అన్నారు.

దళితబందు పథకం తనకు ఎంతో ఇష్టమైన పథకం అని, దళితులకు ఆసరాగా నిలిచే ఈ పథకం అమలులో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు, యం.పిలు డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, పద్ధతి మార్చుకోకుంటే వేటు తప్పదని కేసీఆర్ ఆపార్టీ నాయకులను హెచ్చరించారు. ఎవరెవరు ఎంతెంత వసూలు చేశారు అనే చిట్టా కూడా తనదగ్గర ఉందని కేసీఆర్ అన్నారు.

తాను ఎవరిని వదులుకోవాలని అనుకోవడం లేదని, శృతి మించి అతి చేసే నాయకులను బైటకి పంపించడం తధ్యం అని.. ఇది గుర్తెరిగి పార్టీ కోసం పనిచేయాలని నాయకులకు కేసీఆర్ సూచన చేశారు. నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, శ్రీహరి లను ఉద్దేశించి కేసీఆర్ ప్రస్తావించారు.

రాష్ట్రంలో రోజురోజుకూ బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని, కాంగ్రెస్ పార్టీని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలోనే కాక దేశ స్థాయిలో కూడా బిఆర్ఎస్ పార్టీ చక్రం తిప్పబోతుందని కేసీఆర్ అన్నారు.

ADVERTISEMENT
Latest Stories