పులి నిద్ర లేచింది.. బయటకు వస్తుందా… రాదా?

KCR likely to campaign in Jubilee Hills bypoll battle

నవంబర్‌ 11న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికలో గెలిచి తీరాలని బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ చాలా పట్టుదలగా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. కనుక నేడు ఫామ్‌హౌసులో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై వారికి దిశా నిర్దేశం చేశారు.

పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో కేసీఆర్‌ పేరు కూడా ఉంది. కనుక అయన కూడా ఎన్నికల ప్రచారానికి వస్తారని డప్పు మోగుతోంది. ఈ రోజు సమావేశంలో ఆయన గులాబీ కండువా వేసుకొని చాలా ఉల్లాసంగా కనిపించారు. పార్టీ నేతలకు ఎదురెళ్ళి స్వాగతం పలికారు.

ADVERTISEMENT

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్‌ పార్టీ తప్పకుండా గెలుస్తుందని ఇప్పటికే ఆ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి అదే ఓటర్లకు కూడా చెపుతోంది. కనుక కేసీఆర్‌కి కూడా ఆటువంటి సంకేతం ఏమైనా అందిందా? అందుకే అయన అంత ఉల్లాసంగా ఉన్నారా? అందుకే ప్రచారానికి రాబోతున్నారని డప్పు మొదలైందా?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏది ఏమైనప్పటికీ, మళ్ళీ చాలా రోజుల తర్వాత తమ అధినేత ఇంత ఉత్సాహంగా రాజకీయాల గురించి మాట్లాడటంతో బీఆర్ఎస్‌ పార్టీ నేతలు చాలా సంతోషిస్తున్నారు. వారికి ఈ మాత్రం సంతోషం, నమ్మకం, ధైర్యం కలిగించగలిగితే చాలు… అందరూ హనుమంతుడిలా చూసి రమ్మంటే కాల్చి రాగల సమర్ధులే!

అయితే కేసీఆర్‌ ఈ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని, పార్టీ అభ్యర్ధిని గెలిస్తే అదేమీ గొప్ప విషయం కాబోదు. ఎందుకంటే అది బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి రవీంద్రనాథ్ చనిపోవడం వలన ఖాళీ అయిన సీటే గనుక!

ఇంతకాలం ఫామ్‌హౌసు గడప దాటని కేసీఆర్‌, ఈ సీటు దక్కించుకోవదానికి ఎన్నికల ప్రచారానికి వస్తే అది పార్టీకి లబ్ది కలిగించవచ్చేమో కానీ బీఆర్ఎస్‌ పార్టీ బలహీనతకి ఆయనే నిదర్శనంగా నిలుస్తారు.

కేటీఆర్‌, హరీష్ రావులకు పార్టీని అప్పగించినా ఇద్దరూ నడిపించలేక మళ్ళీ కేసీఆర్‌ రావలసి వచ్చిందని కాంగ్రెస్‌, బీజేపిలు విమర్శించకుండా ఉండవు.

ఒకవేళ ఆయన ప్రచారం చేసిన బీఆర్ఎస్‌ పార్టీ ఓడిపోతే అది ఇంకా పరువు తక్కువ. ఆ పార్టీకే చెందిన ఈ సీటుని తిరిగి దక్కించుకోలేకపోయారు. ఇక రాజకీయాల నుంచి రిటైర్ కావాల్సిన సమయం ఇదేనంటూ కాంగ్రెస్‌, బీజేపిలు ఎద్దేవా చేయకమానవు.

ఈ విషయం కేసీఆర్‌కి కూడా బాగా తెలుసు. కనుక ఎప్పటిలాగే ‘ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా…’ అంటూ హడావుడి చేసి చివరి నిమిషంలో మొహం చాటేయవచ్చు.

కానీ కేసీఆర్‌ ఈ ఎన్నికల ప్రచారానికి వస్తేనే చాలా మంచిది. ఆయన మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ అవగాలరా లేదా? ఉంటారా తప్పుకుంటారా?అనే స్పష్టత వస్తుంది. అప్పుడు బీఆర్ఎస్‌ పార్టీతో సహా కాంగ్రెస్‌, బీజేపి, కల్వకుంట్ల కవిత అందరూ ఏవిదంగా ముందుకు సాగాలో నిర్ణయించుకోగలుగుతారు.

ADVERTISEMENT
Latest Stories