హైదరాబాద్, పాతబస్తీకే పరిమితమైన మజ్లీస్ పార్టీకి, దాని అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఆంధ్రా ఎన్నికలతో సంబంధం ఏమిటి? అంటే ఏమీ లేదనే చెప్పొచ్చు.
కానీ ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడుకి మోడీని ఎదిరించే ధైర్యం లేదు. జగన్మోహన్ రెడ్డికే ఆ ధైర్యం ఉంది. అవసరమైతే మోడీని ఢీకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసినవి జగన్ సాధించుకోగలరు. కనుక ఆంధ్రా ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డినే ఎన్నుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
టిడిపి బీజేపీతో పొత్తు పెట్టుకుంది కనుక, అసదుద్దీన్ ద్వేషిస్తున్న ప్రధాని మోడీతో చంద్రబాబు నాయుడు చేతులు కలిపారు కనుక ఓవైసీ టిడిపి, జనసేన, బీజేపీల కూటమిని వ్యతిరేకిస్తూ, జగన్‌కు మద్దతు ప్రకటించిన్నట్లు పైకి కనిపిస్తుంది.
అయితే ఓవైసీ చెప్పిన్నట్లు జగన్‌కు అంత ధైర్యమే ఉండి ఉంటే మోడీతో పోరాడి ఏపీకి ప్రత్యేక హోదా కోసం సాధించుకునేవారే కదా?కానీ 5 ఏళ్ళు మోడీకి విధేయంగానే మసులుకున్నారు. ఎన్నికల గంట మొగిన తర్వాత నేటికీ విధేయంగానే ఉన్నారు.
మరైతే ఓవైసీ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? అంటే మరో బలమైన కారణమే ఉంది. కేసీఆర్, ఓవైసీలు ప్రస్తుతం దూరంగా ఉన్నప్పటికీ వారి ఆత్మ ఒక్కటే. అది ఎన్నటికీ విడిపోదు. కేసీఆర్,జగన్‌లకు కూడా ఇదే వర్తిస్తుంది.
కేసీఆర్ కూడా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, ఈసారి లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి 200 కంటే తక్కువే సీట్లు వస్తాయని అప్పుడు బిఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఏపీలో జగన్ గెలుస్తారని చెప్పారు. గెలవాలనే కోరుకొంటున్నారు కూడా.
పైగా వారి ఉమ్మడి శత్రువులు చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్రమోడీలే. కనుక కేసీఆర్ చెపుతున్నట్లు ఒకవేళ బీజేపీకి కేంద్రంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినంత బలం రాకపోతే అప్పుడు, మజ్లీస్, వైసీపి, బిఆర్ఎస్ ఇంకా తమతో కలిసివచ్చే డీఎంకె వంటి పార్టీలను, బీజేపీని వ్యతిరేకించే వామపక్షాలు అన్నీ ఏకం అవడం ఖాయం.
ప్రస్తుతం కేసుల కారణంగా జగన్ మోడీకి విధేయంగా ఉన్నప్పటికీ, మోడీని గద్దె ఎక్కలేని పరిస్థితే వస్తే ఆయనను అడ్డుకునేందుకు తప్పకుండా కేసీఆర్‌తో చేతులు కలపడం ఖాయమే. అందుకే జగన్ గెలవాలని కేసీఆర్ కోరుకుంటున్నారని అనుకోవచ్చు.
జగన్ గెలవాలని కేసీఆర్, ఓవైసీలు కోరుకోవడానికి మరో బలమైన కారణం కూడా ఉంది. కేసీఆర్ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేసి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారు. ఒకవేళ ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆయన రేవంత్ రెడ్డికి అండగా నిలబడి కేసీఆర్‌ని అడ్డుకునే అవకాశం ఉంటుంది.
అదే… జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోవచ్చేమో కానీ కేసీఆర్‌కు అన్నివిధాలా ఉపయోగపడతారు. అందుకే ఏపీలో జగన్ గెలవాలని కేసీఆర్, ఓవైసీలు కోరుకొంటున్నట్లు భావించవచ్చు.
బహుశః కేసీఆర్ సూచన మేరకే అసదుద్దీన్ ఓవైసీ జగన్‌ని గెలిపించాలని ఆంధ్రాలో ముస్లిం ప్రజలకు పిలుపు ఇచ్చి ఉండవచ్చు.




