తెలంగాణాలో ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. అయితే కొన్ని రోజులు కేసీఆర్ ను చంద్రబాబు టెన్షన్ పెట్టింది మాత్రం వాస్తవమే. అసలు చంద్రబాబు అనే వాడు లేకపోతే కేసీఆర్ ప్రచారంలో అంత కష్టపడి ఉండేవారు కాదని తెరాస నాయకులే ఒప్పుకుంటారు. అయితే ఆ మాత్రం టెన్షన్ కలిగించిన చంద్రబాబును కూడా ఊరికే వదలకూడదు అని నిర్ణయించుకున్నారు కేసీఆర్. బాబుకు తొందరలో ఆంధ్ర రాజకీయాలలోకి ఎంటర్ అయ్యి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయమని మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు.
[m9ad]
ఈ దిశగా కేసీఆర్ ఇప్పటికే పని మొదలుపెట్టారని అంటుంది ఒక తెలుగు పత్రిక, ఆంధ్ర రాజీకయలలోకి డైరెక్టుగా వేలు పెట్టకుండా అక్కడి ప్రతిపక్షాలకు సపోర్టు చేసి బాబును ఇరుకున పెట్టాలి అనేది కేసీఆర్ వ్యూహమట. ఏపిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు జగన్, పవన్ మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. వీరిద్దరి మధ్య ఉన్న స్ఫర్థలను తొలగించి ఒకే వర్గంగా ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా వైకాపా లేదంటే జనసేన పార్టీకి వెళ్లి టీడీపీకి నష్టం చేకూరుతుందన్న ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తుంది.
వీరిద్దరికి తోడు వామపక్ష పార్టీలను కూడా కలిపి ఆంధ్రప్రదేశ్‌లో కూటమిని ఏర్పాటు చేస్తే చంద్రబాబు ఓటమి ఖాయమని కేసీఆర్ భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇటీవలే జరిగిన తెలంగాణ ఎన్నికలలో ఈ రెండు పార్టీలు దూరంగా ఉండి ఒకరకంగా పరోక్షంగా తెరాసకు మద్దతు ఇచ్చాయి. మహాకూటమి ఓటమే లక్ష్యంగా పని చేశాయి. అయితే ఒక రకంగా ఇది తెలంగాణాలో చంద్రబాబు చేసిన మహాకూటమి ప్రయత్నం వంటిదే. ఈ మధ్య కాలంలో ఇటువంటి ప్రయోగం మన దగ్గర రెండు సార్లు జరిగింది.
2009లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీ తప్ప మిగతా అన్ని పక్షాలను ఒక తాటి మీదకు తెచ్చారు చంద్రబాబు. అప్పట్లో చంద్రబాబుతో జతకట్టారు కేసీఆర్ అయితే అప్పుడు విఫలమైన ఈ ప్రయోగాన్ని మళ్ళీ ఇటీవలే తెలంగాణ ఎన్నికలలో కేసీఆర్ మీదే ప్రయోగించారు చంద్రబాబు. కానీ మరోసారి విఫలం అయ్యింది. ఈ సారి దాని వల్ల లాభపడ్డారు గులాబీ దళపతి. ఒకరకంగా ఈ రెండు ప్రయోగాలను చాలా దగ్గర నుండే చూశారు కేసీఆర్. ఈ క్రమంలో ఈ ప్రయోగం ఆంధ్రలో ఏమవుతుందో చూడాలి?



