తమిళనాడుని దశాబ్దాలుగా ఏలుతున్న రెండు ద్రవిడ పార్టీల విధానాలు, పనితీరుని అధ్యయనం చేసి బీఆర్ఎస్ పార్టీ కూడా అదేవిధంగా ముందుకు సాగాలని కేసీఆర్ చెపుతుంటారు. ఎందుకంటే, తమిళనాడులో పాగా వేసేందుకు జాతీయ పార్టీలైన బీజేపి, కాంగ్రెస్ పార్టీలు ఎంతగా ప్రయత్నించినా సాధ్యపడటం లేదు!
ఆ రెండు పార్టీనే ప్రజలు మార్చి మార్చి ఎన్నుకొని అధికారం కట్టబెడుతున్నారు. కనుక వాటి సక్సస్ ఫార్ములాని కాపీ కొట్టగలిగితే, తెలంగాణలో ఇక ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉండవచ్చని, తమ కుటుంబమే రాష్ట్రాన్ని పాలించుకోవచ్చని కేసీఆర్ ఆలోచన కావచ్చు.
కానీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏవిదంగా ‘తెలంగాణ సెంటిమెంట్’ చల్లారిపోకుండా ఎప్పటికప్పుడు రగిలిస్తూ ప్రజలను ఆకట్టుకుంటోందో, అదేవిదంగా తమిళనాడులో ఆ రెండు పార్టీలు కూడా తమిళుల భాషాభిమానం ఏమాత్రం తగ్గకుండా కాపాడుకుంటూ నెగ్గుకొస్తున్నారని చెప్పవచ్చు.
బీఆర్ఎస్ నేతలు ‘ఆంధ్రా దోపిడీదారులు’ అంటూ రాజకీయ మైలేజ్ పొందుతూ, ‘ఉత్తరాది పెత్తనం’ అంటూ కాంగ్రెస్, బీజేపిలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంటుంది.
సరిగ్గా అదేవిధంగా డీఎంకే, అన్నా డీఎంకేలు కూడా హిందీ పేరుతో తమిళనాడులో బీజేపి, కాంగ్రెస్ పార్టీలను విజయవంతంగా అడ్డుకుంటున్నాయి.
కనుక కేసీఆర్ ఇప్పటికే వాటి ఫార్ములాను విజయవంతంగా అమలుచేస్తూనే ఉన్నారు. కనుక వాటికీ, బీఆర్ఎస్ పార్టీ విధానాలకు పెద్దగా తేడా లేదనే చెప్పాలి.
బహుశః అందువల్లేనేమో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఆచ్చం కేసీఆర్‌లాగే వ్యవహరించారు. ప్రధాని మోడీ కోయంబత్తూరు వచ్చినప్పుడు స్వయంగా వెళ్ళి ఆహ్వానించకుండా తన మంత్రిని పంపించారు!
ప్రధాని మోడీ పట్ల స్టాలిన్ ఆగ్రహానికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ ప్రోటోకాల్ కోసం కాకపోయినా దేశ ప్రధాని వచ్చినప్పుడు కనీసం మర్యాద పాటిస్తూ వెళ్ళి ఆహ్వానించి ఉండి ఉంటే, బహుశః ప్రధాని మోడీ కూడా అయన వినతుల పట్ల సానుకూలంగా స్పందించేవారేమో?కానీ స్టాలిన్ కూడా అచ్చం కేసీఆర్ లాగే ప్రధాని మోడీని అవమానించారు. కనుక రిజల్ట్ కూడా అలాగే వస్తుంది.
తమిళనాడులో ద్రవిడ పార్టీలు గీసిన హిందీ లక్షణరేఖను ప్రధాని మోడీ ఇప్పుడు దాటలేకపోవచ్చు. కానీ కేసీఆర్‌కి, శశికళకు చెక్ పెట్టినట్లే ఏదోరోజు స్టాలిన్‌కి కూడా చెక్ పెట్టకుండా ఉండరు.
ద్రవిడ పార్టీలను చూసి నేర్చుకోవాలనుకున్న కేసీఆర్ రాజకీయంగా దెబ్బ తిన్నారు. ఇప్పుడు స్టాలిన్ కూడా కేసీఆర్‌లా మోడీని అవమానించి, ఆయనపై కత్తులు దూస్తుంటే నష్టపోకుండా ఉంటారా?






