శనివారం సాయంత్రం నాడు హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సభలో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యర్థులపై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇటీవల కాలంలో కాస్త సైలెంట్ గా తన పని తానూ చేసుకుంటున్న కేసీఆర్, తెలంగాణా ఉద్యమ నాటి ప్రసంగాలను గుర్తు చేసారు.
ముఖ్యంగా ఏపీ సిఎం చంద్రబాబును టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరిందని, అందుకే వీరిద్దరూ ప్రత్యక్ష విమర్శలకు దూరంగా ఉంటున్నారని రాజకీయ వర్గాల్లో వినపడిన టాక్ కేవలం తాత్కాలికమేనని కేసీఆర్ నిరూపించారు. “మా బజార్లు మేం ఊడ్చుకుంటాం, నీకు ఏపీ ఉంది, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా, హైదరాబాద్ లో నీ ముద్రలు చాలానే ఉన్నాయంటూ” చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
దాదాపుగా 30 నిముషాల పాటు అనర్గళంగా మాట్లాడిన కేసీఆర్, అవకాశం చిక్కినప్పుడల్లా హైదరాబాద్ లో దుర్భర పరిస్థితులకు చంద్రబాబుని ఎత్తి చూపే ప్రయత్నం చేసారు. అయితే ఈ స్థాయిలో కేసీఆర్ విమర్శించడం అనేది, గ్రేటర్ పరిధిలో చంద్రబాబుకున్న పట్టును చూసి భయపడటమేనా? లేక తన వాగ్ధాటికున్న బలాన్ని మరోసారి ప్రదర్శించడమా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
100 సీట్లతో ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం అనే స్థాయి నుండి, 60 సీట్లు టీఆర్ఎస్ కు వచ్చినా, ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠంపై కూర్చుంటామనే స్థాయికి రావడానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీయే అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. హైదరాబాద్ లో కేసీఆర్ ఎత్తి చూపుతున్న దుర్భర పరిస్థితులకు చంద్రబాబు ఎంతవరకు కారణమో చెప్పలేం గానీ, హైదరాబాద్ లో ఈ స్థాయి అభివృద్ధి జరిగిందంటే ప్రధాన కారణం చంద్రబాబేనని, అందుకే బాబుని టార్గెట్ చేసినట్లుగా విశ్లేషకులు వ్యక్తపరుస్తున్న భావం.
అంతేకాదు చంద్రబాబు అసలు ఎప్పుడూ అనని విషయాలను (హైదరాబాద్ విదేశం వంటివి) ప్రస్తావించి, ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన స్థాయిని తగ్గించుకుని మాట్లాడారనేది మరో అభిప్రాయం. చంద్రబాబుకు ఎవరూ ఓటు వేయరని చెప్తున్న కేసీఆర్, మరి ఈ స్థాయిలో బాబుపై మండిపడం దేనికో అంటూ నెటిజన్లు వేస్తున్న ప్రశ్నలు అనేకం. ఎన్నికల ప్రచారానికి కొద్ది సమయం మాత్రమే ఉండడంతో “లాస్ట్ పంచ్” గట్టిగా ఉండాలనే ఉద్దేశంతో.., బహుశా తనదైన రీతిలో కేసీఆర్ చెలరేగిపోయి ఉంటారని ఒక అంచనా.





