అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు అపూర్వగౌరవం… ఇక్కడ?

KCR - Jaganఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్‌ల ఆలోచనా విదానం, పాలనా విదానం పూర్తి భిన్నంగా ఉంటుందని అందరికీ తెలుసు. కేసీఆర్‌లోని రాజకీయ నాయకుడిని పక్కనపెట్టి చూస్తే, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల పట్ల ఎంత గౌరవంగా వ్యవహరిస్తారో ప్రతీ సభలోను చూడవచ్చు.

ADVERTISEMENT

ఈరోజు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో జరిగిన సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ, “ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తన నియోజకవర్గం అభివృద్ధి కోసం నా వెంటపడుతూనే ఉంటాడు. ఏదోలా నన్ను ఒప్పించి అన్నీ సాధించుకొంటూనే ఉంటాడు. హాస్పిటల్‌ కావాలన్నాడు. కట్టించుకొన్నాడు. ఇప్పుడు రెవెన్యూ డివిజన్‌ కావాలంటున్నాడు. ఆయన అడిగితే కాదనలేను. త్వరలోనే మంజూరు చేస్తాను.

మీ అందరికీ ఇంత మంచి చేస్తున్న ఆయనను వచ్చే ఎన్నికలలో ఆశీర్వదించాలని కోరుతున్నాను,” అంటూ అక్కడే వేదికపై నుంచి టికెట్‌ ఖరారు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆయన, అనుచరులు సంతోషంతో పొంగిపోయారు.

ఏపీలో ప్రభుత్వ సలహాదారులు ఏమి చేస్తున్నారో ఎవరికీ తెలియదు. కానీ తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్న రాజీవ్ శర్మకి కాలుష్య నియంత్రణ బోర్డు బాధ్యతలు కూడా అప్పగిస్తే, ఆయన పలుమార్లు పటాన్‌చెరు పారిశ్రామికవాడలలో పర్యటించి కాలుష్య నియంత్రణకు ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ని ఏర్పాటు చేయించారని, అంతే కాకుండా ఇక్కడి కాలుష్యం వలన ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి అవసరమని పట్టుబట్టి నిర్మింపజేశారని, ఈ క్రెడిట్ ఆయనదే అని సభాముఖంగా రాజీవ్ శర్మని సిఎం కేసీఆర్‌ ప్రశంశించారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు గురించి మాట్లాడుతూ, “మీ అందరికీ తెలుసు… హరీష్ రావు ఏదైనా పని మొదలుపెడితే పూర్తి చేయకుండా వదిలిపెట్టడని. ఆయన సాగునీటి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అప్పగిస్తే అందరినీ పరుగులు పెట్టించి మూడేళ్ళలో పూర్తి చేయించాడు.

వైద్య ఆరోగ్యశాఖ అప్పగిస్తే రాష్ట్రంలో ఎక్కడికక్కడ ప్రభుత్వాసుపత్రులు నిర్మింపజేస్తున్నాడు. హైదరాబాద్‌ నగరంలోనే 5 కార్పొరేట్ స్థాయి హాస్పిటల్స్ నిర్మింపజేస్తున్నాడు. కరోనా సమయంలో ఆక్సిజన్ కోసం చాలా ఇబ్బంది పడ్డామని భావించి పెద్ద ఆక్సిజన్ ప్లాంట్‌ని ఏర్పాటు చేయించాడు. కొత్తగా నిర్మిస్తున్న 5 హాస్పిట లో ప్రతీ బెడ్డుకి ఆక్సిజన్ సరఫరా ఉండేలా నిర్మిస్తున్నాము.

హరీష్ రావు ఎల్లప్పుడూ మీ మద్యనే ఉంటాడు. కనుక ఆయనకు మీకు ఏం కావాలో బాగా తెలుసు. అందుకే ఇలా పని చేసుకుపోతూనే ఉంటాడు. ఇలాంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నందునే బంగారి తెలంగాణ సాధించుకోగలుగుతున్నాము,” అని ప్రశంశల వర్షం కురిపించారు.

ఏపీలో ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులున్నాయని అందరికీ తెలుసు. ఎంతసేపు స్వోత్కర్షే తప్ప ఏనాడూ ఈవిదంగా ప్రజల ముందు మంత్రులను, ఎమ్మెల్యేలను, ఆధికారులను ప్రశంశించిన దాఖలాలు కనబడవు. అందుకే వైసీపీలో అందరూ మేమందరం నిమిత్తమాత్రులం… అన్నట్లు వ్యవహరిస్తుంటారని భావించవచ్చు. తెలంగాణలో అధికారులకు ప్రజలు కూడా జేజేలు పలుకుతుంటే, ఏపీలో అధికారులను ప్రజలు, ప్రతిపక్షాలు, చివరికి కోర్టులు కూడా ఆక్షేపిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు అంత గౌరవం పొందగలుగుతున్నప్పుడు ఏపీలో ఎందుకిలా?

ADVERTISEMENT
Latest Stories