తెలంగాణ ఓటర్లు తెలంగాణ రాష్ట్ర సమితికి మరోసారి పట్టం కట్టారు. వస్తున్న ఫలితాలు బట్టి 119 సీట్లకు గానూ 90కి పైగా సీట్లు సాధించే దిశగా కారు దూసుకుపోతుంది. ఈ క్రమంలో మహాకూటమిలోని అన్ని పార్టీలకు కలిపి గట్టిగా ఇరవై సీట్లు కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. పింక్ సునామీలో కాంగ్రెస్ పార్టీలోని హేమా హేమీలు కూడా ఓడిపోతున్నారు. నిన్న మొన్నటివరకూ సీఎం కాండిడేట్లు అని చెప్పుకున్న వారంతా మట్టి కరిసిపోయారు. రేవంత్ రెడ్డి వంటి వారికి కూడా ఓటమి తప్పలేదు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
[m9ad]
మరోవైపు బీజేపీ ఈ ఎన్నికలలో బాగా బలపడుతుంది. ఇండిపెండెంట్లు బాగా ప్రభావం చూపిస్తారు అనుకున్నా అది కూడా వట్టి దే అని తేలిపోయింది. బీజేపీ సిట్టింగ్ స్థానాలలో కూడా ఎదురీదుతోంది. బీజేపీ అధినేత లక్ష్మణ్ ఓటమి ఖాయంగా కనిపిస్తుండగా కిషన్ రెడ్డి, రాజా సింగ్ వంటి వారు కూడా అటో ఇటో అన్నట్టుగానే ఉన్నారు. దీనితో ప్రతిపక్షమంతా హోల్ సేల్ గా ప్రభావం చూపించలేకపోయింది అనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. నాలుగు సంవత్సరాల పాటు వినోదం చూసి ఎన్నికల నోటిఫికేషన్ రాగానే హడావిడి చేస్తే ప్రజలను మభ్యపెట్టలేరు అని ఈ ఎన్నికలు చాటి చెప్పాయి.
లగడపాటి వంటి వారి సర్వేలను నమ్మి ఏకంగా గవర్నర్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి అవకాశం ఇవ్వమనడం, క్యాంపు రాజకీయాలకు సిద్ధం అవ్వడంతో మహాకూటమి పూర్తిగా అభాసుపాలు అయ్యింది. ఈ ఓటమి నుండి వారు తేరుకోవడం కూడా అంత కష్టం కాబోతుంది. ఈ ఫలితాలు 2019లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా ప్రభావం చూపిస్తాయి. కూటమిలోని సిపిఐ, తెలంగాణ జన సమితి కనీసం ఖాతా కూడా తెరవలేకపోవడంతో కూటమిలోని ఇబ్బందులు తలెత్తవచ్చు.
అసలు ఈ పార్టీలన్నీ పార్లమెంట్ ఎన్నికలలో కలిసి పని చేస్తాయంటే అనుమానమే. టీడీపీ పార్టీకి ఇది మరింత ఇబ్బంది. కూకట్ పల్లి వంటి స్థానంలో కూడా ఓడిపోవడమంటే ఇక ఆ పార్టీకి ఇక్కడ భవిష్యత్తు లేనట్టే. దానికి తోడు 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు చంద్రబాబు నాయుడు ఇంకో శత్రువును కలుపుకున్నట్టే. ఉన్న వారు చాలనట్టు. ఎన్నికల లోపే చంద్రబాబు మెడకు చుట్టుకోవడానికి ఓటుకు నోటు కేసు బయటకు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. మొత్తానికి తెలంగాణ ఎన్నికలలు ప్రతిపక్షానికి ఆత్మహత్యా సదృశ్యంగా మారిపోయాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు.



