అప్పుడు తెలంగాణని ఇప్పుడు భారత్‌ని వదిలేస్తున్నారా?

BRS-TRS-KCR

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణాలలో పార్టీ పేరుని మార్చడం కూడా ఒకటని ఆ పార్టీ నేతలు చెప్పుకొంటున్నారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీలో తెలంగాణను తొలగించుకొని భారత్‌ చేర్చుకోవడం వలన టిఆర్ఎస్ పేరుతో మానసికంగా కనెక్ట్ అయ్యున్న సామాన్య ప్రజలు పార్టీకి దూరమయ్యారని, కనుక పార్టీ పేరును మళ్ళీ టిఆర్ఎస్ పార్టీగా మార్చుకుంటే ప్రజలు దగ్గరవుతారని కొందరు సీనియర్ నేతలు కేసీఆర్‌కు తమ అభిప్రాయాలు చెప్పారు.

ADVERTISEMENT

అంతకు ముందు కేసీఆర్‌ చెపితే నేతలు వినడమే తప్ప పార్టీలో ఎవరూ కేసీఆర్‌కు చెప్పే పరిస్థితి ఉండేదే కాదు. అందుకే పార్టీలో హరీష్ రావు వంటి సీనియర్ నేతలు సైతం టిఆర్ఎస్ పేరుని బిఆర్ఎస్ పార్టీగా మార్చుతున్నపుడు ఎవరూ వ్యతిరేకించలేక చప్పట్లు కొట్టారు.

కానీ ఇప్పుడు శాసనసభ ఎన్నికలలో పార్టీ ఓడిపోయిన తర్వాత అందరూ కేసీఆర్‌కు చెపుతున్నారు. అంటే కేసీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయం తప్పని, మీ ఈ తప్పుడు నిర్ణయం కూడా పార్టీ ఓటమికి ఓ కారణమని చెప్పకనే చెపుతున్నారన్న మాట!

కానీ కేసీఆర్‌ నేటికీ ఇది తన వలన ఓటమి అని అంగీకరించడం లేదు. పార్టీ ఓటమికి కాంగ్రెస్ పార్టీని, కారు గుర్తుని పోలిన ఎన్నికల గుర్తులను, చివరికి ఓట్లు వేసిన ప్రజలను కూడా నిందిస్తున్నారు. ఓడిపోయినా కేసీఆర్‌ ఆత్మవిమర్శ చేసుకోలేదని, అహం తగ్గలేదని శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు విన్నప్పుడు స్పష్టమవుతుంది.

కానీ పార్టీ పేరు మార్చడం అవసరమని కేసీఆర్‌ కూడా అంగీకరించిన్నట్లే ఉన్నారు. మళ్ళీ బిఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీగా మార్చేందుకు అవసరమైన న్యాయ ప్రక్రియ చేస్తున్నామని, వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ పేరు, జండాతోనే పోటీ చేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.

ఆనాడు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనే కోరికతో పార్టీ పేరులో తెలంగాణను వదిలేసుకొని ప్రజలకు దూరమయ్యారు. ఇప్పుడు పార్టీ పేరులో భారత్‌ని వదిలేసుకునేందుకు సిద్దం అవుతున్నారు. అంటే కేసీఆర్‌ జాతీయ రాజకీయాల గురించి ఇక ఆలోచన చేయకుండా తెలంగాణ రాష్ట్రానికే పరిమితమవుతారేమో?

కేవలం డబ్బు మూటలతో దేశ రాజకీయాలను శాశించవచ్చనుకుంటే అంబానీ, ఆదానీ, టాటా, బిర్లాలు ఎప్పుడో ప్రధానమంత్రులు అయ్యి దేశాన్ని శాసించేవారు కదా?కానీ వారు అత్యంత ధనికులైనప్పటికీ ఇటువంటి ఆలోచన ఎన్నడూ చేయలేదు. అపర చాణక్యుడు ఇంత చిన్న లాజిక్ గ్రహించలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది.

ADVERTISEMENT
Latest Stories