ప్రస్తుతం తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ 10 ఏళ్ళ పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని అడుగుతున్నారు.
ముఖ్యంగా సిఎం కేసీఆర్,మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తదితరులు ఎన్నికల ప్రచార సభలలో పాల్గొన్నప్పుడు ఆయా జిల్లాలలో, నియోజకవర్గాలలో చేసిన అభివృద్ధి పధకాలను ప్రజలకు గుర్తు చేసి, తెలంగాణ ఏర్పడక మునుపు కాంగ్రెస్ పాలనలో మీ ప్రాంతాలు ఏవిదంగా ఉండేవి? ఇప్పుడు ఎలా ఉన్నాయో పోల్చి చూసుకోమని అడుగుతున్నారు.
తెలంగాణ ఏర్పడక మునుపు పరిశ్రమలకు కరెంటు లేక వ్యవసాయానికి నీళ్ళు లేక, ప్రభుత్వ సహాయం కూడా అందక ఎంతగా అల్లాడిపోయారో ఓసారి గుర్తు చేసి, ఇప్పుడు మీ ఊర్లలోనే గలగల పారుతున్న కాలువలు, నిండుకుండల్లా ఉన్న చెరువులు, 24 గంటలు విద్యుత్ సరఫరా, ఎక్కడికక్కడ ఆసుపత్రులు, కాలేజీలు వగైరా ఏర్పాటు చేశామని సగర్వంగా చెప్పుకొంటున్నారు.
ఈ పదేళ్ళలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పధకాల గురించి కూడా కేసీఆర్ అండ్ టీమ్ అచ్చమైన తెలంగాణ భాష, యాసలోనే చాలా చక్కగా ప్రజలకు వివరిస్తున్నారు. కనుక మీ కళ్ళ ముందున్న అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయమని ధైర్యంగా అడుగుతున్నారు.
ఒకవేళ కాంగ్రెస్‌ని గెలిపిస్తే తెలంగాణ పరిస్థితి కూడా అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలామారిపోయే ప్రమాదం ఉందని కుండబద్దలు కొట్టిన్నట్లు చెపుతున్నారు. తెలంగాణకు మరో వైపున్న కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ రాష్ట్రంలో సమస్యలు ఎలా మొదలైపోయాయో బిఆర్ఎస్ నేతలు సాక్ష్యాధారాలతో సహా ప్రజలకు వివరిస్తున్నారు.
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికరంలోకి వస్తే ఈ అభివృద్ధి కొనసాగుతుందని, అదే… కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమరావతి, ఏపీలా తయారవుతుందని, మనకీ ఇలాంటి దుస్థితి అవసరమా?అని తెలంగాణ మంత్రులు ప్రజలను అడుగుతున్నారు. కానీ ఏపీ మంత్రులకి చీమ కుట్టిన్నట్లు కూడా అనిపించకపోవడం విశేషం.
అభివృద్ధి కోసం రోడ్లు, ఫ్లైఓవర్లు, భవనాలు కట్టక్కరలేదు. పరిశ్రమలు, ఐటి కంపెనీలను తెచ్చి ఉద్యోగాలు కల్పించక్కరలేదు. అభివృద్ధి అంటే సంక్షేమ పధకాలే. సంక్షేమ పధకాలతో ప్రజల జీవితాలు మెరుగవుతున్నాయంటే అభివృద్ధి సాధిస్తున్నట్లే కదా?అని వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు. సంక్షేమ పధకాలతో ఎందరు బాగుపడ్డారో తెలీదు కానీ వాటి కోసం చేస్తున్న అప్పులు కొండల్లా పెరిగిపోతున్నాయి. తిరిగి ఆ భారం ప్రజలపైనే కరెంటు ట్రూ అప్ చార్జీల రూపంలోనో ఇంటి పన్ను పెంపు రూపంలోనో వేస్తూనే ఉంది. అయినప్పటికీ “ఏపీకి జగనే ఎందుకు అవసరం?” అనే ప్రశ్నకు సమాధానం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు బస్సులు వేసుకొని ఊరూరూ తిరుగుతూనే ఉన్నారు.
కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధితో కూడిన సంక్షేమం అవసరమా లేక సంక్షేమాన్నే అభివృద్ధిగా భావించి ఓట్లు వేయాలో ప్రజలే నిర్ణయించుకోవాలి.




