జగన్ నివాసం ఉంటున్న లోటస్ పాండ్ ను ఈడీ అటాచ్ మెంట్ జాబితాలో పెట్టడంతో, భవిష్యత్తులో జగన్ నివాసం పరిస్థితి ఏమిటా అన్న ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్ లో సందడి చేసాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సిఎం కేఈ కృష్ణమూర్తి ప్రతిపక్ష నేతకు ఓ బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జగన్ కు చెందిన లోటస్ పాండ్ అటాచ్ చేయడంతో, ఇంకా జగన్ రాష్ట్రానికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు.
జగన్ సొంత రాష్ట్రానికి రావాల్సిన సమయం ఆసన్నమైందని… జగన్ వస్తానంటే అమరావతిలో ఇల్లు కట్టించి ఇస్తామని… ప్రతిపక్ష నేతకు నివాసం ఇవ్వడానికి తమ ప్రభుత్వం సంశయించదని… ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వంపై జగన్ ఎన్ని విమర్శలు చేసినా… ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత నివాసం లేకుండా ఉంటే బాగోదన్న అభిప్రాయాన్ని పరోక్షంగా కృష్ణమూర్తి వ్యక్తపరిచారు. దీంతో చంద్రబాబు సర్కార్ జగన్ కు ఓ బంపర్ ఆఫర్ ను ప్రకటించిందని వ్యంగ్య వ్యాఖ్యానాలు జోరుగా వినపడుతున్నాయి.



