కృష్ణాజిల్లాలో ‘ఖైదీ’ ఫ్లెక్సీలను చించేసారు!

Khaidi No 150 Banner Torn - Megastar Chiranjeeviసంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన సినిమాలన్నీ మంచి వసూళ్ళను సాధిస్తూ దూసుకెళ్తున్న తరుణంలో… ఆదివారం అర్ధరాత్రి సమయంలో కృష్ణాజిల్లాలో ఓ ఘటన చోటుచేసుకుంది. మెగాస్టార్ చిరంజీవికి చెందిన “ఖైదీ నంబర్ 150” ఫ్లెక్సీలతో పాటు, వంగవీటి రంగా చిత్రాలున్న ప్లెక్సీలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం స్థానికంగా కలకలం రేపింది. కైకలూరు మండలం అటపాకలో జరిగిన ఈ సంఘటనకు నిరసన వ్యక్తం చేస్తూ… అటు చిరంజీవి అభిమాన సంఘాలు, ఇటు రంగా అభిమానులు రహదారులపై వచ్చారు.

భీమవరం – కైకలూరు రహదారిపై యువత ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ, నిరసనలను విరమించేందుకు అభిమానులు ససేమిరా అంటున్నారు. ఆందోళన విరమించేది లేదని చెప్తున్న తరుణంలో… ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, నిందితులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామని మరో పక్కన పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ADVERTISEMENT

అయితే ఇంతకుముందు రోజు విజయవాడ, అజిత్ సింగ్ నగర్ లో రంగా విగ్రహాన్ని కూల్చడంతో, దీని వెనుక ఏమైనా స్కెచ్ ఉందా అన్న అనుమానం కూడా నెలకొంటోంది. కృష్ణాజిల్లాలో నమోదవుతున్న ఈ ఘటనలపై చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత కనపడుతోంది. ముఖ్యంగా ‘ప్రభుత్వం కాపు వర్గానికి వ్యతిరేకం’ అన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే విధంగా ఈ చర్యలు ఉంటున్నాయని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఒక్క సినిమాకు సంబంధించి అయితే చిరంజీవి ఫ్లెక్సీలనే మాత్రమే ధ్వంసం చేసేవారు. కానీ, ఇక్కడ చిరుతో పాటు రంగా ఫ్లెక్సీలను చించేసారు కాబట్టి, దీని వెనుక రాజకీయ శక్తులు కూడా ఉన్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories