మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రభావం యూ ట్యూబ్ లో కూడా స్పష్టంగా కనపడుతోంది. తాజాగా మెగాస్టార్ ఈ సినిమాపై స్పందిస్తూ… మీరంతా గర్వించేలా…ఇదిరా! చిరంజీవి.. అనేలా “ఖైదీ నంబర్ 150” సినిమా ఇస్తాను. ది బెస్ట్ పెర్ఫామెన్స్ ని ఇస్తాను అని మెగాస్టార్ చిరంజీవి అంచనాలు పెంచే మరో నాలుగు మాటలను పలికారు.
మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ (మా) డైరీ -2017ను ఆవిష్కరించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసారు. చిరంజీవి స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, “ఈ చిత్రంతో తిరిగి వస్తున్నందుకు తమ్ముళ్లు 150 గులాబీలు ఉన్న పుష్పగుచ్ఛం ఇచ్చి ఉత్సాహపరచడం ఎంతో సంతోషంగా ఉంది. తమ్ముళ్ల ప్రేమ మురిపిస్తోంది. కళామ్మతల్లి ముద్దుబిడ్డలుగా నాపై ప్రేమ కురిపిస్తున్నందుకు మైమరచిపోతున్నా. ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ అలరించే చిత్రమవుతుందని” అన్నారు.
‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శి శివాజీరాజా ఆధ్వర్యంలోని టీమ్ అందరూ మెచ్చుకునేలా ‘మా’ని నడిపిస్తున్నారు. ‘మా’ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ గా వారిని ప్రత్యేకించి అభినందిస్తున్నాను. అందరికీ, క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని చిరంజీవి అన్నారు. అంతకుముందు, చిరంజీవిని ‘మా’ బృందం సత్కరించి, కేక్ కట్ చేయించింది. 150 గులాబీలతో ఉన్న ఒక పుష్పగుచ్ఛాన్ని ‘మా’ అధ్యక్ష కార్యదర్శులు చిరంజీవికి అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.
మా డైరీ ఆవిష్కరణను కూడా ‘ఖైదీ నంబర్ 150’ సినిమా ప్రమోషన్ కు వాడేయడం అనేది… సినిమా పబ్లిసిటీపై మెగాస్టార్ ఏ స్థాయిలో ఆలోచిస్తున్నారో అని చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తోందని సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు. “కత్తి” సినిమా చూసిన వారిని కూడా మైమరిచిపోయే విధంగా మెగాస్టార్ మెప్పిస్తే, అది అసలైన సక్సెస్ అవుతోందని సినీ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.



