“ఖైదీ నంబర్ 150” సినిమా ఎప్పుడూ లైం లైట్ లో ఉండే విధంగా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అప్ డేట్స్ ఇస్తోన్న ఈ సినిమా సంగతులు మెగా అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి. అయితే వారిని మరింత ఉత్తేజ పరిచేందుకు చిత్ర నిర్మాణ సంస్థ సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తోంది. తాజాగా వివి వినాయక్ ఫ్రేమ్ లో చూస్తూ ఉన్న కొన్ని సెకన్ల వీడియోను పోస్ట్ చేసి… ఆ ఫ్రేంలో ఎవరున్నారో కనుక్కోమంటూ మెగా అభిమానులకు ఓ పజిల్ విసిరింది.
దీంతో ఆ ముడి విప్పేందుకు సోషల్ మీడియాలో మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. కొందరు కమెడియన్ సునీల్ ఉన్నారంటూ, మరికొందరు అలీ అని, ఇంకొకరు మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ చూసి వినాయక్ నవ్వుతున్నారంటూ ఎవరికి తోచిన విధంగా వారు చెప్తూ ఉన్నారు. అయితే ఇటీవల లక్ష్మి రాయ్ తో స్పెషల్ సాంగ్ ముగియడంతో… ఆ పాటలో చిరుతో పాటు రామ్ చరణ్ కూడా స్టెప్పులు వేసి ఉంటారన్న ఓ టాక్ హల్చల్ చేస్తోంది. ఇదే జరిగితే మెగా అభిమానులకు కన్నుల పండుగ ఖాయం.
గతంలో రామ్ చరణ్ కూడా ఈ విషయం స్పందిస్తూ… ‘నాకు ఈ ప్రతిష్టాత్మక సినిమాలో చేయాలని ఉంది, బహుశా కుదిరితే ఏదైనా ఒక పాటలో అలా చిందేస్తానేమో’ అంటూ చెప్పారు. దీంతో లక్ష్మి రాయ్ తో చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ లో చెర్రీ, మెగాస్టార్ స్టెప్పులు వేస్తుండగా, వినాయక్ చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతున్నారేమో అన్న గెస్ కూడా ఉంది. మరి ఎవరిదీ సరైనదోనని అభిమానులు రిజల్ట్స్ కోసం వేచిచూస్తున్నారు.
Because the director is the first audience for any film. Any guesses who was in the frame? #KhaidiNo150 pic.twitter.com/SeVgKFe7HM
— #KhaidiNo150 (@KonidelaPro) November 4, 2016



