తన రీ ఎంట్రీ సినిమాతో టాలీవుడ్ లోని అన్ని రికార్డులకు మెగాస్టార్ ‘ఎర్త్’ పెట్టినట్లుగా కనపడుతున్నారు. ఇప్పటికే ఓపెనింగ్స్ పరంగా యూ ట్యూబ్ రికార్డ్స్ ని ఓ కుమ్ము కుమ్ముతున్న మెగాస్టార్ హవా, ప్రస్తుతం బుల్లితెరను కూడా తాకింది. సిల్వర్ స్క్రీన్ కు దూరమై పదేళ్ళు గడిచినా, ప్రస్తుతం ఉన్న మార్కెట్ ను మించిన స్థాయిలోనే ‘ఖైదీ నంబర్ 150’ బిజినెస్ జరుగుతోంది.
ఇప్పటికే పలు ఏరియాల్లో ‘బాహుబలి’ స్థాయి బిజినెస్ ను జరుపుకుని అవాక్కు చేసిన ‘ఖైదీ నంబర్ 150,’ తాజాగా బుల్లితెర శాటిలైట్ హక్కుల విషయంలోనూ సరికొత్త రికార్డులను నమోదు చేసుకుందని సమాచారం. ఒకప్పటి టాలీవుడ్ అగ్ర హీరోలైన చిరు, బాలయ్య, నాగ్, వెంకీల చిత్రాలలోకల్లా అత్యధిక శాటిలైట్ హక్కులను దక్కించుకున్న సినిమాగా మెగాస్టార్ సరికొత్త రికార్డును సృష్టించారు.
ఓ ప్రముఖ టెలివిజన్ దాదాపు 13 కోట్లు వెచ్చించి ‘ఖైదీ నంబర్ 150’ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి తొలుత ‘మా’ టెలివిజన్ వద్దే హక్కులను ఉంచాలనుకున్నప్పటికీ, ఇతర ఛానల్స్ నుండి ఫ్యాన్సీ ఆఫర్లు రావడంతో, ‘ఖైదీ నంబర్ 150’ ప్రొడక్షన్ యూనిట్ శాటిలైట్ హక్కులను విక్రయించేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. విడుదల చేసిన ఒక టీజర్, రెండు ఆడియో సాంగ్స్ తో యూ ట్యూబ్ లో పలు రికార్డులను సొంతం చేసుకున్న మెగాస్టార్ రేంజ్ కు నిదర్శనంగా ఈ సరికొత్త రికార్డ్ నిలుస్తోంది.



