సోషల్ మీడియా, యూ ట్యూబ్ లో మెగాస్టార్ హవా కొనసాగుతోంది. సాదాసీదా పాటలతోనే భారీ హంగామా సృష్టిస్తున్నారు. “ఖైదీ నంబర్ 150” సినిమాలో ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు ‘అద్భుతం’ అనిపించే విధంగా లేకపోయినా, యూ ట్యూబ్ లో భారీ క్లిక్స్ ను అందిపుచ్చుకుంటున్నాయి. మొదటి పాట ఇప్పటికే 5 మిలియన్ క్లిక్స్ దాటగా, రెండవ పాట అప్పుడే 1 మిలియన్ మార్క్ ను దాటుకుంది.
క్రిస్మస్ కానుకగా శనివారం నాడు విడుదలైన ‘సుందరి’ పాట కూడా దేవిశ్రీ మార్క్ రొటీన్ ఫ్లిక్ గానే ఉందన్న టాక్ ను సొంతం చేసుకుంది. సంగీత సాహిత్య ప్రియులు పెదవి విరిచినప్పటికీ, మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడంలో మాత్రం దేవిశ్రీ సక్సెస్ అయినట్లుగా ఈ యూ ట్యూబ్ క్లిక్స్ చెప్తున్నాయి. దీనికి తోడు తాజాగా సోషల్ మీడియాలో ‘బాస్’కు సంబంధించిన ఓ స్టిల్ తెగ హంగామా చేస్తోంది.
కత్తి మీద చేయి మోపు చేసి ఉన్న మెగాస్టార్ మాస్ స్టిల్ చూసి తట్టుకోవడం ఫ్యాన్స్ వల్ల కావడం లేదని చెప్పడంలో సందేహం లేదు. యాక్షన్ పార్ట్ లో భాగంగా ఉన్న ఈ స్టిల్ తో ‘ఖైదీ నంబర్ 150’ సినిమా కేవలం మెగా అభిమానుల కోసమే ఫక్తు మాస్ మసాలాగా తెరకెక్కిందని స్పష్టమవుతోంది. మెగా అభిమానుల సమీకరణతో మెగాస్టార్ స్టామినాను నిరూపించేందుకు జనవరి 4వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.



