ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కిలారు రాజేష్ నిందితుడని ఏపీ సీఐడీ పేర్కొంది. అతను హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారని కూడా ఏపీ సీఐడీకి తెలుసు. కనుక విచారణకు హాజరవ్వాలని కోరుతూ నోటీసులు ఇవ్వాలన్నా, అరెస్ట్ చేయాలన్నా ఎటువంటి ఇబ్బందీ లేదు. చట్ట ప్రకారం చేయవచ్చు.
కానీ అలా చేయకుండా మూడు రోజుల క్రితం ఆయన తన కుమార్తెను స్కూలు నుంచి తీసుకువచ్చేందుకు బయలుదేరినప్పుడు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనాన్ని వెంబడించారు. వారు వైసీపికి చెందిన వ్యక్తులని అనుమానించిన కిలారి రాజేష్ వారిని, వారి వాహనాలను నంబర్లతో సహా ఫోటోలు తీసి, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సమర్పించి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు సెక్షన్స్ 341,506 కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
వారు సంచరించిన ప్రాంతాలలోని సిసి కెమెరా రికార్డింగులు, రాజేష్ సమర్పించిన వారి వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేసి వారు ఏపీ ఇంటలిజన్స్ విభాగంలో కౌంటర్ ఇంటలిజన్స్ పోలీసులై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వారిలో ఒకరు హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులని అనుమానిస్తున్నారు. వారు సివిల్ దుస్తులు ధరించి కిలారి రాజేష్‌ని వెంబడించిన్నట్లు భావిస్తున్నారు. వారిలో ఒక వ్యక్తి వాహనానికి ఉన్న నంబర్ ప్లేట్ నకిలీదని జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు.
ఒక రాష్ట్రానికి చెందిన పోలీసులు మరో రాష్ట్రంలో ఈవిదంగా వ్యవహరిస్తే, రెండు రాష్ట్రాలకు కొత్త సమస్యలు సృష్టించిన్నట్లవుతుంది. హైదరాబాద్‌లో నివశిస్తున్న ఏ వ్యక్తిపైనైనా వేరే రాష్ట్రానికి చెందిన పోలీసులు చర్యలు తీసుకోవాలనుకొంటే, చట్ట ప్రకారం ముందుగా హైదరాబాద్ పోలీసులకు తెలియజేసి వారి అనుమతి, సహకారంతోనే చర్యలు తీసుకోవలసి ఉంటుంది.
కానీ రాజేష్ విషయంలో ఏపీ ఇంటలిజన్స్ పోలీసులు నిబందనలు అతిక్రమించడం, హైదరాబాద్ నగరంలో నకిలీ నంబర్ ప్లేటుగల వాహనంపై తిరగడం నిజమేనని జూబ్లీహిల్స్ పోలీసులు ధృవీకరించుకొని వారిని అరెస్ట్ చేస్తే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఎక్కడికక్కడ పోలీసులు తనికీలు నిర్వహిస్తున్నారు. ఇటువంటి సమయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఏమవుతుంది?




