చూసే భాగ్యానికి ఇది సరిపోదేమో!

 Vinaro Bhagyamu Vishnu Katha Movie talkమంచి వినసొంపైన టైటిల్. పవిత్రమైన కృతిలోని లైన్ తీసుకుని సినిమా పేరుగా పెట్టారు. సహజంగానే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఇలాంటివి ఆసక్తి రేపుతాయి. కిరణ్ అబ్బవరం లాంటి అప్ కమింగ్ హీరో అయితే యూత్ కూడా అట్రాక్ట్ అవుతారు. సరిగ్గా ఇదే లెక్కతోనే నిర్మాత బన్నీ వాస్ వినరో భాగ్యము విష్ణుకథకి నెల రోజులకు పైగా ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చారు. కిరణ్ కూడా అలుపెరగకుండా ఇంటర్వ్యూలు గట్రా ఇస్తూ జనం దృష్టిలో పడుతూ వచ్చాడు. ధనుష్ సార్ కి పాజిటివ్ టాక్ వచ్చిన ఒక రోజు తర్వాత రిలీజ్ పెట్టుకోవడం ఓపెనింగ్స్ పరంగా కొంత రిస్క్ అయినా ఫైనల్ గా థియేటర్లలో విష్ణు అడుగుపెట్టేశాడు.

శాఖాహార భోజనం చేసేటపుడు నాన్ వెజ్ మీల్స్ గురించి ఆలోచించకూడదు. మిలిటరీ హోటల్ కు వెళ్ళినప్పుడు పులిహోర గురించి ఎంక్వయిరీ చేస్తే సర్వర్ కూడా పగలబడి నవ్వుతాడు. అస్సలు సింక్ అవ్వని విషయాలను లింక్ చేస్తే ఇలాగే ఉంటుంది. విష్ణుకథలో ఈ కన్ఫ్యూజన్ ఉంది. నిజానికి ట్రైలర్ తో మొదలుపెట్టి పోస్టర్ల దాకా దీన్నో డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గానే ప్రొజెక్ట్ చేశారు. కానీ ఇదో క్రైమ్ థ్రిల్లర్. తన పొరుగింటి నెంబర్ ఎవరిదనే ఆసక్తితో హీరోయిన్ మన విష్ణుకి కాల్ చేసి గుడ్డిగా పరిచయం పెంచేసుకుని వెంటనే లవ్ లో పడిపోతుంది. ఇంకో నెంబర్ ద్వారా ఏజ్ బార్ అంకుల్ తగిలితే అతనితో ఊ అంటావా ఊహూ అంటావా రీల్స్ చేస్తుంది.

ADVERTISEMENT

ఇలా అసంబద్దంగా క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేసిన దర్శకుడు మురళీకృష్ణ అబ్బూరు అసలు కథను ఇంటర్వెల్ నుంచి మొదలుపెడతాడు. ఒక హత్య. దాని వెనుకో రహస్యం. అది మాములు సీక్రెట్ కాదు. దేశభద్రతకు సంబంధించినది. బహుశా హీరోని నిర్మాతని విపరీతమైన ఎగ్జైట్మెంట్ కు గురి చేసిన పాయింట్ ఇదే అయ్యుంటుంది. దీన్ని ఛేదించడానికి మన విష్ణు నడుం బిగిస్తాడు. కనిపించిన వాళ్లందరికీ సహాయం చేసే ఇతను విదేశాలకు వెళ్లే సాహసాలు కూడా చేస్తాడు. ఫస్ట్ హాఫ్ లో శ్రీమంతుడులో మహేష్ బాబు చేసినట్టు ఒక ఫైట్, సెకండ్ హాఫ్ లో బాలయ్య లాగా పంచె కట్టుకుని మరో ఫైట్ అలవోకగా కానిస్తాడు. ఇంత చేసినా మాస్ కి కిక్ రాదు.

సినిమా ఎలా ఉందనేది కాసేపు పక్కనపెడితే కిరణ్ అబ్బవరం వీలైనంత త్వరగా మాస్ ట్రాప్ నుంచి బయటికి రావాలి. తను ఎలాంటివాటికి ఫిట్ అవుతాడో గుర్తించి అవసరం లేని హీరో ఎలివేషన్లకు దూరంగా ఉండాలి. అప్పుడే పక్కింటి కుర్రాడిలా అనిపిస్తాడు. నితిన్ లాంటి వాళ్ళు కూడా కెరీర్ ప్రారంభంలో ఇలాంటి పొరపాట్లే చేసి తర్వాత తమ స్కూల్ కు వచ్చారు. అతనంటే రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి వాళ్ళతోనూ చేసే అవకాశం దొరికింది కాబట్టి ఓకే. కానీ కిరణ్ కు అలాంటి ఛాన్స్ అంత సులభంగా వచ్చేనా. విష్ణుకథలో దర్శకుడు మురళికృష్ణ మర్చిపోయిన లాజిక్ ఒకటుంది. స్టోరీలో ట్విస్టులు పెడితే సినిమా అవుతుంది. ముందు ట్విస్టులు అనుకుని కథ రాస్తే సగం ఉడికిన గుడ్డు అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories