‘మండదా అక్కా… మండదా చెల్లి… మండదా తమ్ముడు… మండదా అవ్వా…’ అంటూ ఎన్నికల ప్రచారంలో జగన్ చేసిన ప్రచారానికి ప్రజలు బాగానే ప్రతిస్పందించారు. నిజంగానే జనాలకు బాగా మండిందని ఫలితాల అనంతరం అందరికీ అవగతమైంది.
అయితే ప్రజలకు ఇంత పెద్ద ఎత్తున మండుతుందని కనిపెట్టిన ఒకే ఒక్క వ్యక్తి కిరణ్ కొండేటి. ఎగ్జిట్ పోల్స్ అనంతరం ‘కేకే సర్వే’ పేరుతో విడుదల చేసిన ఫలితాలు నిజం కావడంతో, రాజకీయ వర్గాలతో పాటు ప్రజలందరి నోళ్ళల్లో ‘కేకే సర్వే’ మారుమ్రోగిపోతోంది.
ఎన్నికలకు మూడు నెలల క్రితం పోలింగ్ సరళని అంచనాలు వేయడం ప్రారంభించామని, అయితే పోలింగ్ జరిగిన తర్వాత ముందుగా అంచనా వేసిన స్థానాలకు మించి కూటమి జయకేతనం కొట్టబోతోందని తమకు అర్ధమయ్యింది కిరణ్ కొండేటి ఇటీవల వెల్లడించిన ఇంటర్వ్యూలలో స్పష్టం చేసారు.
అయితే ఎవరు చెప్పిన దానిని వారు సమర్ధించడం సహజమే కదా, ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు మండుతుందన్న విషయాన్ని టీడీపీ మరియు జనసేన వర్గాలు కూడా అంగీకరించే పరిస్థితిలో లేరు. కానీ అంచనాలకు మించి వచ్చిన ఫలితాలు ఓ విధంగా వైసీపీని మానసిక వేదనకు గురి చేస్తాయని చెప్పడంలో సందేహం లేదు.
ఇక నుండి కిరణ్ కొండేటి అన్న పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో హల్చల్ చేయడం ఖాయంగా కనపడుతోంది. దేశ స్థాయిలో ప్రశాంత్ కిషోర్ పేరు ఏ విధంగా అయితే సంచలనం సృష్టించిందో, ‘కేకే సర్వే’ పేరుతో కిరణ్ కొండేటి అంతే స్థాయిలో నిలబడడం ఖాయంగా కనపడుతోంది.






