రాష్ట్ర సచివాలయాన్ని జగన్ ప్రభుత్వం తాకట్టు పెట్టి రూ.370 కోట్లు అప్పు తెచ్చుకొందనే వార్త చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు వైసీపి నేతలు కూడా ఉలిక్కిపడ్డారు. వెంటనే మాజీ బూతుశాఖ మంత్రి కొడాలి నాని రంగంలో దిగిపోయి “ప్రభుత్వానికి డబ్బు అవసరమైతే ఏదైనా తాకాట్టు పెట్టుకుంటాము. సచివాలయం ఏమైనా చంద్రబాబు సొంత ఆస్తా? సచివాలయం అంటే జస్ట్ రూ.20 కోట్లు విలువ గల 2 ఎకరాల భూమి మాత్రమే.. దానికి ఇంత గగ్గోలు దేనికో,” అంటూ చాలా వెటకారంగా మాట్లాడారు.
రాజధాని లేని రాష్ట్రమని చెప్పుకునేందుకే రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకొందని చెప్పుకోవాలంటే ఎంత సిగ్గు… అవమానం? కానీ కొడాలి నాని నిసిగ్గుగా తాకట్టు పెడితే తప్పేమిటని ఎదురు ప్రశ్నిస్తుండటం చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోతున్నారు.
కొడాలి నాని ఇంత గట్టిగా సమర్ధించుకున్నాక, మళ్ళీ వైసీపి ఎల్లో మీడియా తప్పుడు వార్తలు వ్రాస్తూ, తమ ప్రభుత్వంపై బురద జల్లుతోందంటూ సోషల్ మీడియాలో ఆక్రోశించడం విచిత్రం. ‘సచివాలయం తనఖా పచ్చి అబద్దం’ అని ఖండిస్తూ సోషల్ మీడియాలో వైసీపి పెట్టిన పోస్టులో హెచ్‌డిఎఫ్‌సీ లేఖని జత చేసింది.
ఇంతకీ సోషల్ మీడియాలో హెచ్‌డిఎఫ్‌సీ లేఖ అబద్దామా?లేక వైసీపి ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పింది అబద్దామా? ఒకవేళ జగన్ ప్రభుత్వం సచివాలయాన్ని తనఖా పెట్టకపోతే కొడాలి నాని ఎందుకు అలా మాట్లాడారు? అనే ప్రశ్నకు వైసీపియే సమాధానం చెప్పాలి.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తనపై జగన్ ప్రభుత్వం మొత్తం ఎన్ని కేసులు నమోదు చేసిందో తెలపాలంటూ డిజిపికి లేఖ వ్రాశారు. అలాగే రాష్ట్రంలో తాకట్టులో ఉన్న ప్రభుత్వాస్తుల వివరాలను ఇవ్వాలని అన్ని బ్యాంకులకు ఓ లేఖ వ్రాస్తే అవే బయటపెడతాయి! ఎందుకంటే రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దగ్గర నుంచే రాబట్టుకోవలసి ఉంటుంది కదా?




