Kodali Nani press meetమీడియా ముందుకు కొడాలి నాని రావడం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు మరియు ఆయన తనయుడు లోకేష్ లను తిట్టడం సర్వసహజం. తాజా ప్రెస్ మీట్ లో ఇందుకు విరుద్ధంగా ఏమీ వ్యాఖ్యలు చేయలేదు. చంద్రబాబు, లోకేష్ లకు తోడు ఈ సారి ‘భీమ్లా నాయక్’ రూపంలో పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యాడు.

ఓ పక్కన చిరును పొగుడుతూ మరో పక్కన పవన్ తిడుతూ, చంద్రబాబు చెప్పింది వినవద్దంటూ సూచనలు చేస్తూ సాగిన ప్రెస్ మీట్ లో కొడాలి నాని పొత్తుల గురించి ప్రస్తావించారు. రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికలలో అధికార వైఎస్సార్సీపీ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తుందని, తమకెవరి సహాయం అవసరం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.

ప్రస్తుతానికి బహిరంగంగా వెల్లడించినా, లేకున్నా టీడీపీ – జనసేన పొత్తు రాజకీయంగా అనివార్యం కావడంతో, ఈ రెండు జత కట్టడం ఖాయమని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఇప్పటికే టీడీపీ అధినేత రెండు సార్లు వ్యాఖ్యానించగా, రాజకీయంగా పవన్ ఎట్టి పరిస్థితులలోనూ జగన్ కు చేయి అందించరు గనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది.

టీడీపీ – జనసేనల పొత్తు పక్కన పెడితే, వైసీపీ సింగిల్ గానే ఎన్నికలకు వెళ్తుందని కొడాలి నాని ప్రస్తావించడం అత్యంత హాస్యాస్పదంగా మారింది. ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీతో జత కట్టేందుకు ఏ పార్టీ కూడా సుముఖంగా లేదు. టీడీపీ, జనసేనలను పక్కన పెడితే, వామపక్షాలు మరియు బీజేపీలు ఉండగా, వామపక్ష పార్టీలు ఇప్పటికే జగన్ పాలనపై మండిపడుతున్నాయి. నాడు వైఎస్ తో జతకట్టాము గానీ, నేడు జగన్ కు చేయి అందించేందుకు సిద్ధంగా లేమని తేల్చిచెప్పాయి.

ఇక జాతీయ పార్టీ అయిన బీజేపీ, ప్రస్తుతం పరోక్షంగా వైసీపీకి సహకారం అందిస్తోన్న విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ, అది 2024 సార్వత్రిక ఎన్నికలలో ఉండబోదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబుతో బీజేపీకి ఉన్న విభేధాలే జగన్ కు కలిసి వచ్చే అంశంగా మారింది తప్ప, రాబోయే ఎన్నికలలో మాత్రం బీజేపీ ప్రధాన ప్రతిపక్షాలతో కలిసి పోటీ చేస్తుందనే టాక్ నానాటికి బలపడుతోంది.

రాష్ట్రంలో బీజేపీకున్న 1% ఓటింగ్ శాతం పెద్దగా ప్రభావితం చూపకపోయినా, కేంద్రంలో అధికారంలో ఉండడం బీజేపీకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశంగా మారుతోంది. మిగిలిన మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం అనిపించేటంత దయనీయ పరిస్థితిలో ఉండడంతో, వైసీపీతో జత కట్టే పార్టీ అంటూ రాష్ట్రంలో లేదు. అసలు విషయం ఇది కాగా, కొడాలి నాని మాత్రం తాము సింగిల్ గానే ఎన్నికలకు వెళ్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం హాస్యాస్పదంగా మారింది.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే… ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీలోనే ముసలం ఉందని, చేతిలో ఉన్న అధికారాన్ని వదిలిపెట్టి వచ్చేందుకు ప్రస్తుతం ఏ నాయకుడు సిద్ధంగా లేకపోవడంతో పార్టీలో ఉన్నారు గానీ, ఎన్నికలు దగ్గర పడే నాటికి చాలా మంది నేతలు వైసీపీని వీడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ తరపున మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ఓ ఇరవై, ముప్పై మంది నాయకులు మినహాయిస్తే, ఇతర నేతల్లో అసంతృప్తి పెచ్చు మీరుతోందని, సరైన సమయం కోసం చాలా మంది వేచిచూస్తున్నారన్న భావన రాజకీయ వర్గాల్లో వినపడుతోంది.

ప్రస్తుతం అలాంటి పరిస్థితులలో వైసీపీ ఉన్న తరుణంలో, పొత్తుల గురించి కొడాలి నాని ప్రస్తావించడం అనేది అసందర్భం కాగా, మరొకటి కామెడీగా మారింది. 2019లో అధికారం చేపట్టి, దాదాపుగా మూడేళ్ళ జగన్ పాలనను చవిచూసిన ఏ రాజకీయ నేత అయినా గుండెల మీద చేయి వేసుకుని జగన్ తో పొత్తు పెట్టుకునే సాహసం చేస్తారా? అన్నది అసలు ప్రశ్న. బహుశా మిగిలిన రెండేళ్ళల్లో అద్భుతాలు చేస్తే మాత్రం చెప్పలేం. మరి ఆ అద్భుతాలు జరుగుతాయా?